హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసం ఈసారి దీపావళి పండుగతో ప్రకాశించింది. సినీ ఇండస్ట్రీలో స్నేహం, ఆనందం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలు హాజరయ్యారు. చిరంజీవి ఆతిథ్యంతో జరిగిన ఈ సెలబ్రేషన్ స్టార్ పవర్‌తో నిండిపోయింది.
కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ తమ సతీమణులతో కలిసి ఈ పండుగ వేడుకల్లో పాల్గొని చిరంజీవి కుటుంబంతో కలసి సంబరాలు పంచుకున్నారు. తెరపై పోటీ ఉన్నా, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఈ ముగ్గురు సూపర్స్టార్ల బంధం చెక్కుచెదరని స్నేహానికి నిదర్శనంగా మారింది.
ఇక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నయనతార – విఘ్నేష్ శివన్ జంట. త్వరలో విడుదలకానున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవితో నటిస్తున్న నయనతార తన భర్తతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం అభిమానులకు సర్ప్రైజ్గా మారింది. ఈ నలుగురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ ఫొటోలను పంచుకుంటూ, నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్, నయనతార మరియు వారి కుటుంబాలతో కలిసి దీపాల పండుగ జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రేమ, నవ్వులు, ఐక్యతతో కూడిన ఈ బంధాలే జీవితానికి నిజమైన వెలుగును పంచుతాయి అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు.
ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులు కూడా పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత రంజుగా మార్చారు. చిరంజీవి ఇంటి దీపావళి ఫోటోలు అభిమానులకు నిజమైన పండుగ కానుకగా మారాయి.
టాలీవుడ్లో తరతరాలుగా కొనసాగుతున్న ఈ అగ్ర తారల స్నేహం, ఎలాంటి తరం మార్పులు వచ్చినా, స్నేహం ఎప్పటికీ చిరస్థాయిగానే ఉంటుంది అనే సందేశాన్ని మరోసారి గుర్తు చేసింది.