ఖతర్‌లోని ఆంధ్ర కళా వేదిక ప్రవాసీ తెలుగు సంఘ ఎన్నికలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. ఈ ఎన్నికలలో ప్రముఖ ప్రవాసీ గొట్టిపాటి రమణ తన ప్యానల్‌తో కలిసి అఖండ విజయం సాధించారు. రమణ ప్యానల్‌కి మొత్తం పోలైన ఓట్లలో 73 శాతం ఓట్లు లభించాయి. అనూహ్యంగా వచ్చిన ఈ విజయం ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రత్యర్థి శిబిరం విజయం ఖాయమని నమ్మకం ఉన్నప్పటికీ, రమణ జట్టు ఘన విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ ఎన్నికల్లో రమణతో పాటు జి. కెన్నయ్య దొర, శాంతయ్య ఎలమంచిలి, సౌమ్య కానేటి, లోవశెట్టి వీరబాబు, యస్.వి.యల్.యన్ మూర్తి, కన్నోజు నాగేశ్వరి, శీరిషా తాళ్ళూరి, అయ్యన్న నాయుడు, నరేశ్ నూనే, ధరిణి వంటి పదకొండు మంది సభ్యులు విజేతలుగా నిలిచారు. రమణ ప్యానల్ తరఫున సత్యనారాయణ మలిరెడ్డి, ప్రసాద్ కోడూరి, రమేశ్ దాసరి, అంజనేయులు, బొద్దు రామరావులు వంటి ప్రవాసీ ప్రముఖులు సమర్థవంతంగా ప్రచారం నిర్వహించారు. ఇక వెంకప్ప భాగవతుల ప్యానల్‌కి విక్రం సుఖవాసీ, హరీష్ రెడ్డి, సాయి రమేశ్, గోవర్ధన్ లు మద్దతు ఇచ్చారు.
విజయం అనంతరం రమణ మాట్లాడుతూ, “ఇది కేవలం ఎన్నికల గెలుపు కాదు, బాధ్యత పెరిగిన క్షణం” అని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మనమంతా ఒకే టీం అని ఆయన పేర్కొన్నారు. ఖతర్‌లోని తెలుగు సమాజం సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరింత బలోపేతం అవుతుందని రమణ తెలిపారు. విభిన్న జట్లు ఉన్నా, తెలుగు వారంతా ఒకే కుటుంబమని ఆయన హామీ ఇచ్చారు.
ఇక ఎన్నికల ఫలితాలను స్పందించిన వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ, గెలుపు–ఓటములు సహజమని, ఓటమినీ సానుకూలంగా స్వీకరిస్తున్నామని అన్నారు. ప్రవాసంలో తెలుగు సంస్కృతి పరిరక్షణ, వికాసం నిరంతర ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై తమ ప్యానల్ విశ్లేషణ చేస్తుందని కూడా తెలిపారు.
ఖతర్‌లో తొలి తెలుగు సంఘం “తెలుగు కళా సమితి” కాగా, తర్వాత ఆంధ్ర కళా వేదిక వంటి సంస్థలు ఆవిర్భవించాయి. ఈ వేదికను విశాఖపట్నానికి చెందిన వెంకప్ప భాగవతుల, విక్రం సుఖవాసీలు శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దారు. ఈసారి గెలుపు తమదే అని అనుకున్నా, గొట్టిపాటి రమణ తన ఆత్మవిశ్వాసంతో భారీ విజయం సాధించారు. కుటుంబ ఆధారిత వ్యవస్థలకు వ్యతిరేకంగా ఇది తెలుగు ప్రవాసీయుల స్పష్టమైన తీర్పుగా నిలిచిందని ప్రవాసీ ప్రముఖుడు ప్రసాద్ కోడూరి వ్యాఖ్యానించారు.