- ఏపీఎన్నార్టీ నిత్యం అందుబాటులో ఉంటుంది, కోఆర్డినేటర్లు అందరూ తెలుగు వారికి అండగా ఉండాలి..
- గల్ఫ్ దేశాల ఏపీఎన్నార్టీ కో ఆర్డినేటర్లతో జూమ్ కాల్ లో మంత్రి వ్యాఖ్యలు..
Kondapalli Srinivas Speech About Gulf Peoples: ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల యుద్ద తీవ్రత కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారి రక్షించుకోవడం, వారిని క్షేమంగా చూసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీఎన్నార్టీఎస్ పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఎన్.ఆర్.ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఏపీఎన్నార్టీ కోఆర్డినేటర్లతో ఏపీ ఎన్నార్టీ నిర్వహించిన జూమ్ కాల్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు వారు పడుతున్న ఇబ్బందులు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏయే దేశంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయనే దానిపై అక్కడి కోఆర్డినేటర్లు వివరించారు. దుబాయ్, షార్జా, దోహా, జెడ్డా సహా పలు విమానాశ్రయాల్లో ఉన్న ప్రయాణికులను వారి వారి దేశాలకు తరలించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టినట్లు కోఆర్డినేటర్లు తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, కానీ అటువంటి వార్తలను నమ్మవద్దని, మీడియా సృష్టించినంత భయంకర వాతావరణం తమ వద్ద లేదని వారు వివరించారు.
బ్రహ్రెయిన్ లో కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని, దుబాయ్, కువైట్ సహా ఇతర ప్రాంతాల్లో ఆందోళన కలిగించే వాతావరణం లేదని తెలిపారు. ప్రభుత్వాలు సైరన్ లు మోగించడం, ఎప్పటికప్పుడు ప్రజలను అలెర్ట్ చేయడం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆహారం, మంచి నీరు, వసతి పరంగా ఏ ఇబ్బంది లేదని వారు తెలిపారు. ఏపీఎన్నార్టీ సహకారంతో తాము బాధితులకు అండగా ఉంటామని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న చర్యలు చాలా అద్భుతంగా ఉన్నాయని, అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందనీయమని కోఆర్డినేటర్లు పేర్కొన్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఊహించని పరిస్థితులతో తెలుగువారు ఇబ్బంది పడుతున్నారని, యుద్ధం కారణంగా ప్రభావితం అవుతోన్న కార్మికులు, విద్యార్ధులు, ఉద్యోగులు, పర్యాటకులు అందరినీ రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీఎన్నార్టీ పూర్తి స్థాయిలో పని చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు ఏపీఎన్నార్టీలో, ఇండియన్ ఎంబసీలో రిజిస్టర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు.
గగనతలంలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో విమానాలు రద్దు అవుతున్నాయని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. నిరంతరం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీఎన్నార్టీ, ఆర్టీజిఎస్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారని, వారి ఆదేశాలతో తెలుగు వారిని రక్షించేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి కొండపల్లి వివరించారు. ఏపీఎన్నార్టీ, టీడీపీ ఎన్నారై సెల్ ఏర్పాటు చేసిన, హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేసారు. కరోనా సమయంలో ఏ విధంగా అయితే సేవలు అందించామో, ఈ సంక్షోభ సమయంలో కూడా ఆపదలో ఉన్న వారికి సహకరించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు కోఆర్డినేటర్లు తెలపడం అభినందనీయం అన్నారు.
ఎవరికి ఏ విధమైన ఆందోళన వద్దని, పరిస్థితులు చక్కబడే వరకు ఓపికగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. క్లిష్ట సమయంలో తెలుగు ప్రజలకు అండగా ఉన్న ప్రతీ ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉంటున్న ఏపీ ఎన్నార్టీ అధికారులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఈ జూమ్ కాల్ లో ఏపీఎన్నార్టీ అధ్యక్షులు రవి వేమూరి, ఇతర ఎన్నార్టీ అధికారులు పాల్గొన్నారు.