సొంత జిల్లాలో హత్య జరిగితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లి పరామర్శించలేదు?
జగన్ కనుసన్నల్లోనే పెద్దదస్తగిరి హత్య జరిగింది..
మంగళగిరి: మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “యూజ్ అండ్ కిల్” అనేదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ విధానమని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో వైసీపీ నాయకుల ఆగడాలు అధికారం కోల్పోయి రెండేళ్లు అయినా తగ్గలేదని మంత్రి మండిపడ్డారు. తాడేపల్లి కేంద్రంగా కమాండ్ కంట్రోల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా అరాచక రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు.
కడప జిల్లాలో జరిగిన పెద్ద దస్తగిరి హత్యపై మంత్రి ప్రత్యేకంగా స్పందించారు. ఆ హత్య జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపించారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి సన్నిహితుడైన దస్తగిరి భూవివాదాల నేపథ్యంలో వైసీపీ వర్గాల చేతిలోనే హత్యకు గురయ్యాడని పేర్కొన్నారు. దస్తగిరి ఇంట్లో పోలీసుల తనిఖీల్లో వందల కోట్ల విలువైన భూముల డాక్యుమెంట్లు బయటపడటంతో భూదోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు.
ఇతర ప్రాంతాల్లో చిన్న సంఘటనలకే పరామర్శకు వెళ్లే జగన్, తన సొంత జిల్లాలో జరిగిన ఈ హత్యపై ఎందుకు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నారా చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేసినట్లే, ఇప్పుడు దస్తగిరి హత్యను కూడా కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబును ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం జగన్ రాజకీయ శైలిని చూపిస్తుందని అన్నారు. వైసీపీకి నిజంగా నైతిక విలువలు ఉంటే, అనంతబాబును వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు భూకబ్జాలు చేసి నిర్మించిన ఆస్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.
భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రాయలసీమలో వైసీపీ ప్రభావం తగ్గిపోయిందని, ప్రజలు ఇకపై అరాచక రాజకీయాలను సహించరని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో నైతిక విలువలు, బాధ్యతతో కూడిన పాలన అవసరమని ఆయన హితవు పలికారు.