- Politics: "చట్టం తన పని తాను చేసుకుపోతుంది": పేర్ని నానిపై కేసు నమోదు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు..
- "మా ప్రభుత్వం వచ్చాక ఎవరినీ వదల బొమ్మ": పోలీసులపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.. కేసు నమోదు..
YCP Shock: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, చిలకలపూడి సీఐ పరమేశ్వరరావును ఉద్దేశించి వ్యక్తిగత దూషణలకు దిగారని, ఆయన రూపాన్ని కించపరిచేలా 'బాడీ షేమింగ్' వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులను బెదిరిస్తూ, భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని, అందరి అంతు చూస్తామని హెచ్చరించడంపై పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది.
ఈ ఘటనపై కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధి నిర్వహణలో ఉన్న అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలీసులను అగౌరవపరచడం మరియు వారి విధులకు ఆటంకం కలిగించడం చట్టరీత్యా నేరమని పేర్కొంటూ సంఘం ప్రతినిధులు చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడటం మరియు వ్యక్తిగత దూషణలు చేయడం వంటి సెక్షన్ల కింద మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.