తుని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‍లో పోలవరం ఎల్ఎంసీ పనుల పురోగతిపై సమీక్ష..
పనులు ఆలస్యం చేస్తే, ఉపేక్షించేది లేదని అధికారులకు హెచ్చరిక..
కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లాలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ (LMC) పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ అధికారులకు కీలక సూచనలు చేశారు.
మొదటగా అన్నవరంలోని పంపా అక్విడెక్ట్ వద్ద జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. పనుల నాణ్యత, వేగంపై అధికారులను ప్రశ్నిస్తూ, ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అనంతరం ఆరెంపూడి, గవరయ్య కోనేరు ప్రాంతాల్లో హైవే క్రాసింగ్ వంతెనల నిర్మాణాన్ని పరిశీలించి, పనులు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.
తరువాత తుని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ఎల్ఎంసీ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని, ఆలస్యానికి ఎలాంటి కారణాలైనా సహించబోమని మంత్రి గట్టిగా హెచ్చరించారు. పనులు వేగంగా పూర్తి చేయకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో పోలవరం ఎడమ కాలువ పనులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
రైతులకు నీటి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు నీరు అందుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.