- స్టీల్ ప్లాంట్ కోసం కొన్ని గ్రామాల ప్రజలు త్యాగం చేశారు..
- ఆయా గ్రామాల ప్రజల త్యాగం మరువలేనిది... హోం మంత్రి అనిత..
Anita Nakkapalli Meeting: నక్కపల్లి మండలంలో మంత్రి నివాసం వద్ద విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ నక్కపల్లి మండలం టిడిపి కంచుకోటగా నిలిచిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ అందించే మండలంగా నక్కపల్లి ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి చరిత్రలో తన పేరు నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నక్కపల్లి మండలంలోని అనేక గ్రామాల ప్రజలు చేసిన త్యాగాలను మంత్రి గుర్తుచేశారు.
ఆ గ్రామాల ప్రజల త్యాగం మరువలేనిదని, రాష్ట్ర అభివృద్ధి కోసం వారు చేసిన సహకారం ప్రశంసనీయమని అన్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. టాయ్ పార్క్ ఏర్పాటు ద్వారా సుమారు 20 వేల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయని వెల్లడించారు. అలాగే, ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు పిలుపునిచ్చారు. అడ్డురోడ్డులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కూడా సాధించామని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ స్థాపనతో నక్కపల్లి మరియు పరిసర ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని మంత్రి అనిత ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నక్కపల్లి ప్రాంతం ప్రపంచ పటంలో గుర్తింపు పొందుతోందని అన్నారు.