Indiramma Indlu Scheme: సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణలోని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి నిలిచిపోయిన నిధులను విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెనువెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించడంతో, కేవలం వారం రోజుల్లోనే కోట్ల రూపాయల నిధులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరాయి. హౌసింగ్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో వేల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మొదటి వారంలోనే పెండింగ్ బిల్లులపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,764 మంది లబ్ధిదారులకు సంబంధించి సుమారు రూ. 28.50 కోట్ల నిధులను విడుదల చేశారు. ఎక్కడా ఎటువంటి జాప్యం జరగకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందాలనే లక్ష్యంతో ఈ 'స్పెషల్ డ్రైవ్' నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. కేవలం వారం రోజుల్లోనే ఇంత భారీ మొత్తంలో బిల్లులు క్లియర్ కావడం గమనార్హం.
ఈ నిధుల విడుదలలో అధికారులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు. వివిధ దశల్లో ఆగిపోయిన బిల్లులను వర్గీకరించి మరీ చెల్లింపులు జరిపారు. ముఖ్యంగా ఎల్-3 జాబితాలో ఉన్న 1200 మందికి రూ. 12.06 కోట్లు అందజేయగా, గతంలో సాంకేతిక కారణాల వల్ల బ్యాంక్ చెల్లింపులు విఫలమైన 653 మందికి మరో రూ. 7 కోట్లు విడుదల చేశారు. ఇవే కాకుండా, కొన్ని అభ్యంతరాల వల్ల పరిశీలనలో ఉన్న 911 మంది లబ్ధిదారులకు సైతం రూ. 9.40 కోట్లు అందేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కానున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు పెండింగ్ నిధులు విడుదల చేయడమే కాకుండా, త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నారు. వచ్చే ఏప్రిల్ నెలలో ఈ ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని మంత్రులు ఇప్పటికే సంకేతాలిచ్చారు.
మరోవైపు, ఇలాంటి ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎస్సార్టీసీ ఎండీ, సీపీ సజ్జనార్ హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్లు లేదా ఇంటి బిల్లుల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. లబ్ధిదారులు తమ బిల్లుల స్థితిగతులను నేరుగా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా అధికారిక వెబ్సైట్లలో మాత్రమే చూసుకోవాలని, మోసగాళ్ల మాటలు నమ్మి వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని ఆయన కోరారు.