సింగపూర్‌లో 5 వ రోజు కొనసాగుతున్న మంత్రుల శిక్షణ కార్యక్రమం..
సింగపూర్ సంక్షోభ నిర్వహణ వ్యవస్థ గురించి మంత్రులు బృందం అధ్యయనం..
సింగపూర్: సింగపూర్‌లో కొనసాగుతున్న మంత్రుల శిక్షణా కార్యక్రమం ఐదవ రోజుకూ చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రుల బృందం సింగపూర్‌లో అమలవుతున్న సంక్షోభ నిర్వహణ వ్యవస్థపై (Crisis Management System) ప్రత్యేకంగా అధ్యయనం చేసింది.
సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ (SUSS)కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రజ్వానా, అక్కడి ‘హోల్-ఆఫ్-గవర్నమెంట్’ (Whole-of-Government) విధానం గురించి వివరించారు. విపత్తుల సమయంలో ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఒకే దిశలో సమన్వయంతో పని చేస్తూ ఎలా సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటాయో ఆమె వివరించారు.
ఈ శిక్షణలో సంక్షోభ సమయంలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, నైతిక నిర్ణయాల ప్రాధాన్యత ఏమిటి, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ముందుగానే ఊహించి ఎలా సిద్ధంగా ఉండాలి వంటి కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. ఈ అంశాలు ప్రజల ప్రాణ భద్రతకు, సమర్థ పరిపాలనకు ఎంత ముఖ్యమో వివరంగా అవగాహన పొందారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, బి.సి. జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. సింగపూర్‌లో నేర్చుకుంటున్న ఆధునిక పరిపాలన విధానాలను రాష్ట్రంలో అమలు చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కొనసాగుతోంది.