- ఆర్టీజీఎస్లో బిల్ గేట్స్‌కు ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులకు సీఎం అభినందన..
- బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా ఆర్టీజీఎస్ కేంద్రంలో..
Chandrababu Congratulates officials: పాలనలో వివిధ ప్రక్రియలను, నిబంధనల్ని మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కొన్ని చట్టాలను కూడా సరళతరం చేసేలా నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. దీనిపై అధ్యయనం కోసం ఓ కమిటీ వేయాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం సమీక్షించారు. టెక్నాలజీ అనుసంధానంతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనికి అనుగుణంగా ప్రతీ ప్రభుత్వ శాఖ సన్నద్ధం కావాలని.. సులభతరమైన పౌర సేవల్ని అందించాలని సీఎం సూచించారు.
టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చెల్లింపులు ఇతర ప్రభుత్వ సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కోకూడదని... ఆటోమేషన్ దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వంలోని 8.20 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణా సామర్ధ్యాలను మరింత మెరుగు పరుచుకునేలా వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ కోర్సులను అందించాలని సీఎం సూచించారు. వార్షిక నివేదికల్లోనూ సామర్ధ్యాన్ని ప్రతిఫలించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా ఆర్టీజీఎస్ కేంద్రంలో ఇచ్చిన ప్రజెంటేషన్లు అద్భుతంగా ఉన్నాయని ఆయన అధికారులను అభినందించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, పీపుల్స్ పర్సెప్షన్, ఏజెంట్ స్పేస్ ఏపీఏఐ సెర్చ్ బార్, సంజీవని, అమరావతి ప్రాజెక్టులపై చూపిన ప్రజెంటేషన్లు బిల్ గేట్స్‌ను కూడా ఆకట్టుకున్నాయని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేపట్టే ప్రాజెక్టులను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు.
అత్యుత్తమ ప్రమాణాలు అనుసరించాలి…
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాల్ని అన్నింటా అనుసరించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజల నుంచి మంచి అభిప్రాయం వ్యక్తం అవుతుందని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్నా క్యాంటీన్లలో వడ్డించే ఆహారాన్ని మరింత రుచికరంగా ఉండేలా చూడాలని సీఎం సూచనలు చేశారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో పరిస్థితులు మెరుగుపడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక బెస్ట్ హాస్టల్‌ను మోడల్‌గా తీసుకుని మిగిలిన వాటిలోనూ అవే ప్రమాణాలను పాటించేలా చూడాలన్నారు. అలాగే మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో విజిబుల్ పోలీసింగ్ అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
నేరాల రేటును తగ్గించే అంశంలో పోలీసు విభాగం తమ పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శించాలన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న చర్యల్ని ఎప్పటికప్పుడు మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని హోంశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎప్పటికప్పుడు చెత్తను క్లియర్ చేయటంతో పాటు కలుషిత నీటి సరఫరా కాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇప్పటి నుంచే ముందస్తు కార్యాచరణ చేపట్టాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు డ్రోన్ వినియోగాన్ని పెంచి పౌరసేవలను మరింత సరళతరం చేయాలన్నారు. ఈ సమీక్షకు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ కె.విజయానంద్ పురపాలక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.