ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో (AP TRANSCO) తమ ఉద్యోగులకు, అలాగే సాధారణ ప్రజలకు ఒక వినూత్న అవకాశాన్ని అందించింది. సంస్థ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఉద్యోగుల్లో సృజనాత్మకతను వెలికితీయడం, వారి కృషిని గుర్తించడం లక్ష్యంగా ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తోంది. విద్యుత్ సరఫరా వ్యవస్థను నిరంతరాయంగా కొనసాగించేందుకు సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి అంకితభావం, కష్టసాధ్యమైన పరిస్థితుల్లో చేస్తున్న సేవలను ఈ ఫోటో కాంటెస్ట్ ద్వారా ప్రతిబింబించాలని ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ తెలిపారు.
ఈ పోటీలో పాల్గొనడానికి ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించారు. విద్యుత్ రంగంలో ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, లైన్‌మన్‌లు, సిబ్బంది చేసే కృషిని, ఇన్నోవేషన్, సామర్థ్యాన్ని చూపించేలా ఒరిజినల్ ఫోటోలు తీసి పంపాలని ఏపీ ట్రాన్స్‌కో సూచించింది. డ్రోన్ షాట్‌లకు కూడా అనుమతి ఉందని అధికారులు వెల్లడించారు. ఫోటోలు విద్యుత్ మౌలిక సదుపాయాలు, 400 కెవి, 220 కెవి, 132 కెవి సబ్‌స్టేషన్లు, హాట్ లైన్ వర్క్ వంటి ఇతివృత్తాలపై ఉండాలని సూచించారు.
పాల్గొనేవారు తమ ఫోటోలను photocontest@aptransco.gov.in కి పంపాలి. అలాగే “నా ఫోటోలు భవిష్యత్తులో ఏపీ ట్రాన్స్‌కో వినియోగించుకోవడానికి నాకు అభ్యంతరం లేదు” అనే అంగీకార పత్రాన్ని కూడా జత చేయాలని సూచించారు. ఫోటోలు హై-రిజల్యూషన్ డిజిటల్ ఫార్మాట్‌లో (JPEG/PNG), కనీసం 300 DPI రిజల్యూషన్, 16:9 రేషియోలో ఉండాలి. ఒక్కో పాల్గొనే వారు గరిష్టంగా రెండు ఫోటోలు సమర్పించవచ్చు. ఈ ఫోటోలను నవంబర్ 15లోపు పంపించాలి. చిరునామా, ఫోన్ నంబర్, ఇమెయిల్ ID వంటి వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని అధికారులు తెలిపారు.
విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు సిద్ధంగా ఉన్నాయి. మొదటి బహుమతి రూ.10,000, రెండో బహుమతి రూ.5,000, మూడో బహుమతి రూ.3,000గా నిర్ణయించారు. అలాగే అన్ని పాల్గొనేవారికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు అందజేస్తారు. ప్రత్యేక నిపుణుల కమిటీ సమర్పించిన ఫోటోలను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుంది. విజేతల వివరాలు, ఫోటోలు ఏపీ ట్రాన్స్‌కో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబడతాయి. ఈ పోటీ ద్వారా విద్యుత్ సిబ్బందిలో ఉత్సాహం, సృజనాత్మకత, సామాజిక అవగాహన మరింత పెరుగుతుందనే నమ్మకం అధికారులది.