బస్సులు, కార్లు ఎన్ని ఉన్నా, భారతీయులకు రైలు ప్రయాణం అంటే చాలా నచ్చుతుంది. పొలాల్లో, కొండలు, చెట్ల మధ్య సాగే ఈ ప్రయాణం రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది కాబట్టి చాలా మంది విండో సీట్ కోసం ఆసక్తి చూపిస్తారు.
అయితే, టికెట్ బుకింగ్ ప్రక్రియలో రైల్వే శాఖ ఇప్పుడు మరో కీలకమైన మార్పు చేసింది. మనం సాధారణంగా ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా మొబైల్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటాం. రైల్వే శాఖ తెచ్చిన ఈ కొత్త రూల్ వల్ల నిజమైన ప్రయాణికులు మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేలా, ఏజెంట్లకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు.
ఈ మార్పుల ప్రకారం, రిజర్వేషన్ ట్రైన్ టికెట్ల కోసం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. రిజర్వ్డ్ టికెట్స్ బుకింగ్ ప్రారంభించిన తొలిరోజు, అంటే రిజర్వేషన్ ఓపెన్ అయిన మొదటి 15 నిమిషాల్లో టికెట్ బుక్ చేసుకునేవారికి ఈ రూల్ వర్తిస్తుంది.
మరింత వివరంగా చెప్పాలంటే, అక్టోబర్ 28 నుంచి అమలులోకి వచ్చిన ఈ నిబంధన ప్రకారం, ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య రిజర్వ్డ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే, ప్రయాణికులు తప్పనిసరిగా ఐఆర్సీటీసీలో ఆల్రెడీ ఆధార్ గుర్తింపును కలిగివుండాలి.
ఒకవేళ ఆధార్ ఆథెంటికేషన్ జరగకపోతే, వారు ఆ సమయంలో టికెట్ బుక్ చేసుకోలేరు. ఇది రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్ ప్రారంభించిన తొలిరోజు మాత్రమే వర్తిస్తుంది అని ఐఆర్సీటీసీ తన స్టేట్మెంట్లో స్పష్టం చేసింది. అయితే, జనరల్ రిజర్వ్ టికెట్లకు మాత్రం ఇలాంటి రూల్ లేదు.
రైల్వే మరో విషయం స్పష్టం చేసింది: జనరల్ రిజర్వేషన్ టికెట్ బుకింగ్ ప్రారంభించిన మొదటి 10 నిమిషాల్లో అధికారిక రైల్వే టికెట్ ఏజెంట్లు టికెట్లను బుక్ చేసుకునే వీలు లేదు. తత్కాల్ టికెట్ల బుకింగ్ విషయంలో కూడా ఆధార్ లింక్ చేసిన వారే అధికారిక వెబ్సైట్ లేదా యాప్లో టికెట్ బుక్ చేసుకోగలరని గతంలోనే IRCTC తెలిపింది.
సామాన్య ప్రజలకు టికెట్లు దక్కాలి కాబట్టి, ఓపెనింగ్ సమయంలో అధికారిక టికెటింగ్ ఏజెంట్లు మొదటి అరగంట పాటు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోలేరు. మొత్తంగా మనం చేయాల్సింది ఒక్కటే: ఐఆర్సీటీసీలో మన ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోవాలి మరియు ఆధార్ లింక్ చేసుకోవాలి.
అలా చేసుకుంటే, ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా ఆటోమేటిక్గా ఆధార్ వెరిఫికేషన్ జరిగిపోతుంది, తద్వారా టికెట్ బుకింగ్ విషయంలో ఏ సమస్యా ఉండదు. ఆధార్ లింక్ చేయకపోతే, టికెట్ జనరేట్ అవ్వడంలో సమస్య వస్తుంది.