ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన సామాన్య ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, నిత్యావసర సరుకుల జాబితాలోకి తాజాగా 'గోధుమ పిండి'ని చేర్చింది. నేటి (ఫిబ్రవరి 1) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా ఈ పంపిణీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఇది ఊరటనిచ్చే విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో గోధుమ పిండి ధర దాదాపు రూ. 60 నుండి రూ. 65 వరకు పలుకుతోంది. అయితే, పేద ప్రజల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం కేవలం రూ. 20లకే కిలో గోధుమ పిండి ప్యాకెట్‌ను అందించాలని నిర్ణయించింది. అంటే మార్కెట్ ధర కంటే దాదాపు రూ. 40 తక్కువకే నాణ్యమైన పిండి లబ్ధిదారులకు అందనుంది. ప్రతి నెలా ఒక్కో కార్డుదారుడికి ఒక కిలో చొప్పున ఈ పంపిణీ చేపడతారు.
పౌరసరఫరాల శాఖ ప్రణాళిక ప్రకారం, తొలి విడతలో భాగంగా ఆదివారం నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో పంపిణీ మొదలవుతుంది. తదుపరి దశలో ఈ సౌకర్యాన్ని డివిజన్ కేంద్రాలకు, ఆపై మండల స్థాయిలోని మారుమూల గ్రామాల రేషన్ దుకాణాలకు విస్తరించనున్నారు. ఇప్పటికే అవసరమైన స్టాక్‌ను ప్యాకెట్ల రూపంలో గోదాముల నుండి డీలర్ల వద్దకు చేరవేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వం కేవలం సరుకుల పంపిణీకే పరిమితం కాకుండా, రేషన్ దుకాణాలను 'మిినీ మాల్స్'గా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న పనివేళల్లో మార్పులు చేసి, ప్రజలకు మరింత వెసులుబాటు కల్పించాలని చూస్తోంది. పాత ప్రతిపాదన అయితే నెలకు కేవలం 1 నుండి 15వ తేదీ వరకు, ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు మాత్రమే. కొత్త ప్రతిపాదన ఉదయం నుండి రాత్రి వరకు సుమారు 12 గంటల పాటు దుకాణాలు తెరిచి ఉంచడం ద్వారా లబ్ధిదారులు తమకు నచ్చిన సమయంలో సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది.
గత ఏడాది డిసెంబర్ నుంచే బియ్యంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు గోధుమ పిండిని కూడా జత చేయడంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. పోషకాహారాన్ని సామాన్యులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం బియ్యం, చక్కెర, రాగులు, జొన్నలతో పాటు తక్కువ ధరకే గోధుమ పిండిని కూడా పొందే వీలుంటుంది.