Politics- క్రీడా కోటా ఉద్యోగాల్లో కొత్త రూల్: పరీక్ష పాస్ అయితేనే కొలువు!
క్రీడాకారులకు అలర్ట్: మైదానంలో పతకం.. పరీక్షలో మార్కులు ఉండాల్సిందే!
3 శాతం రిజర్వేషన్ కావాలా? అయితే పరీక్షలో క్వాలిఫై అవ్వాల్సిందే…
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో క్రీడాకారులకు వర్తించే రిజర్వేషన్ నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడా కోటా కింద ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులు ఇకపై కేవలం క్రీడా సర్టిఫికెట్లు ఉంటే సరిపోదు, సంబంధిత నియామక సంస్థలు నిర్వహించే రాత పరీక్షల్లోనూ తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
గతంలో క్రీడాకారులకు ఉన్న 2 శాతం రిజర్వేషన్‌ను ప్రభుత్వం ఇప్పటికే 3 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అయితే, పెరిగిన ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని పొందాలంటే అభ్యర్థులు కనీస అర్హత మార్కులను సాధించడం ఇప్పుడు తప్పనిసరి అయింది. దీనివల్ల ప్రతిభావంతులైన క్రీడాకారులకు మేలు జరగడంతో పాటు, ప్రభుత్వ విధులను నిర్వహించడానికి అవసరమైన కనీస పరిజ్ఞానం ఉన్నవారిని ఎంపిక చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం APPSC, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వంటి సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో క్రీడాకారులు తమ కేటగిరీకి నిర్దేశించిన క్వాలిఫైయింగ్ మార్కులను ఖచ్చితంగా సాధించాలి. మైదానంలో పతకాలు సాధించడంతో పాటు, తరగతి గది పరీక్షల్లోనూ సత్తా చాటితేనే ప్రభుత్వ ఉద్యోగం వరిస్తుంది. ఈ సవరణలు తక్షణమే అమలులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.