Amaravati Capital Bill: అమరావతి బిల్లు ఆమోదం పొందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన గౌరవమని, స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక కీలక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాజధానిపై నెలకొన్న చీకట్లు, సందిగ్ధత నేటితో శాశ్వతంగా తొలగిపోయాయని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్ది, ప్రపంచ పటంలో సగర్వంగా నిలుపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
రైతుల పోరాటానికే విజయం: మంత్రి నారా లోకేష్
"నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్- నా రాజధాని అమరావతి" అంటూ మంత్రి నారా లోకేష్ ఉద్వేగభరితంగా స్పందించారు. ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే రోజు ఇదని, లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని కొనియాడారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలకు దైవ ఆశీస్సులు లభించాయని, వారి శాంతియుత పోరాటమే నేటి విజయానికి పునాది అని లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి బిల్లు చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ చేయడాన్ని మంత్రులు తీవ్రంగా తప్పుబట్టారు.
మంత్రి డీఎస్‌బీవీ స్వామి: బిల్లును వ్యతిరేకిస్తూ సభను బహిష్కరించిన వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే వారు రాష్ట్ర ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. జగన్‌కు రాజధాని గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని, ఇక అమరావతిని ఎవరూ కదల్చలేరని స్పష్టం చేశారు.
మంత్రి పయ్యావుల కేశవ్: జగన్ అమరావతి విషయంలో తొమ్మిది సార్లు మాట మార్చారని, మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలిచ్చిన ఓటుకు నేడు న్యాయం జరిగిందని ఆయన అన్నారు
మంత్రి అనగాని సత్యప్రసాద్: కేవలం 11 సీట్లు వచ్చాయన్న కక్షతోనే వైసీపీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని, జగన్‌కు మతి భ్రమించి పిచ్చి పల్లవి అందుకుంటున్నారని విమర్శించారు.
మంత్రి కొల్లు రవీంద్ర: జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆకాంక్ష అయిన అమరావతిని ఏమీ చేయలేరని, రైతులను హింసించిన జగన్‌ను ప్రజలు ఎన్నటికీ నమ్మరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రులు మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు కూడా ఈ పరిణామంపై సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్లే నేడు రాజధానికి చట్టబద్ధత లభించిందని, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని కొనియాడారు. మరోవైపు ఉత్తరాంధ్ర పోర్టుల పరిశీలన విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి అచ్చెన్నాయుడు కొట్టిపారేశారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్న నేతలకు అవసరమైతే తామే భూతద్దాలు ఇస్తామని ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ సాక్షిగా అమరావతికి లభించిన చట్టబద్ధతతో ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి తెరపడినట్లయింది. ఇకపై నిర్మాణ పనులు వేగవంతం చేసి, రాజధానిని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.