- తానా ఆధ్వర్యంలో మేధో మథనం: డెలావేర్ టోర్నమెంట్‌లో సత్తా చాటిన యంగ్ గ్రాండ్ మాస్టర్స్…
- ఆలోచనా శక్తికి పదును.. ఏకాగ్రతకు పరీక్ష: తానా మిడ్-అట్లాంటిక్ చెస్ ఈవెంట్ హైలైట్స్…
USA TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో మార్చి 15వ తేదీన డెలావేర్‌లోని మిడిల్‌టౌన్ ‘బెస్ట్ బ్రెయిన్స్’ వేదికగా నిర్వహించిన మిడ్-అట్లాంటిక్ చెస్ టోర్నమెంట్ 2026 అత్యంత ఘనంగా ముగిసింది. కమ్యూనిటీకి చేరువయ్యే ఉద్దేశంతో ప్రతి నెలా వివిధ సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను చేపడుతున్న తానా, ఈసారి యువతలోని మేధోపరమైన నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ చెస్ పోటీలను వేదికగా చేసుకుంది. తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి మరియు బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో జరిగిన ఈ పోటీలకు ముందస్తుగానే విశేష ప్రచారం లభించడంతో, పెద్ద సంఖ్యలో యువ క్రీడాకారులు తరలివచ్చి ఎత్తులు, పైఎత్తులతో తమ ప్రతిభను చాటుకున్నారు. టోర్నమెంట్ డైరెక్టర్ జోషువా ఆండర్సన్ మరియు ఈవెంట్ కోఆర్డినేటర్ నాయుడమ్మ యలవర్తి పర్యవేక్షణలో ఈ పోటీలు అత్యంత క్రమశిక్షణతో, సమర్థవంతంగా సాగాయి.
ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంలో తానా మిడ్-అట్లాంటిక్ బృంద సభ్యులైన సతీష్ తుమ్మల, సత్యనారాయణ పొన్నగంటి, సునీల్ కోగంటి, రంజిత్ మామిడి, నవీన్ ఘంటా మరియు హిమతేజ మికిలినేనిలు అహర్నిశలు శ్రమించి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. వారితో పాటు యువ వాలంటీర్లు తపస్వి ఘంటా, కృతి రెడ్డి నిమ్మ, లాలిత్య రెడ్డి యెరువ, ప్రణవ్ కంతేటి, ఆర్నవ్ కంతేటి మరియు దివిత్ శర్మలు అందించిన సేవలను తానా యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. పోటీల అనంతరం నిర్వహించిన ముగింపు వేడుకలో టోర్నమెంట్ డైరెక్టర్ జోషువా ఆండర్సన్‌ను రవి పొట్లూరి ఘనంగా సన్మానించారు. యువతలో ఆలోచనా శక్తిని, ఏకాగ్రతను పెంపొందించే ఇటువంటి మేధోపరమైన క్రీడలకు తానా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పోటీల విజేతల వివరాలను పరిశీలిస్తే, నాన్ రేటెడ్ కె. 8 విభాగంలో ధన్విన్ అమిరిశెట్టి, అనయ్ వర్మ, సరాన్ష్ సాగర్‌లు మొదటి మూడు స్థానాల్లో నిలవగా, నాన్-రేటెడ్ 9-12 విభాగంలో చాణక్య వర్ధన్ కేతిరెడ్డి, లాల్ ఎం, ధ్రుపద్ వెలగపూడి విజేతలుగా నిలిచారు. రేటెడ్ 500 లోపు విభాగంలో హర్షిత్ కన్నన్, రేయాన్ష్ కక్కెర్ల, ప్రతీక్ పరిదా సత్తా చాటగా, రేటెడ్ 900 లోపు విభాగంలో సాయి వెంకట్ శాన్విత్ నందన్ అలహరి, లూకాస్ లియు, పూర్వాన్స్ నాయక్ విజయం సాధించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన రేటెడ్ ఓపెన్ విభాగంలో సాయి రేయాన్ష్ నగిశెట్టి ప్రథమ స్థానంలో నిలవగా, లోహిత్ శ్రీ కృష్ణ ఎంగళ్ళ మరియు సిధ్ తివారీలు తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్లుగా వ్యవహరించిన గ్లెన్‌మూర్ ఫ్యామిలీ డెంటిస్ట్రీ, రాజా గాంధేలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించిన కిషోర్ కుకలకుంట్ల, శ్రీదేవి నెక్కలపులకు మరియు రుచికరమైన భోజన వసతి కల్పించిన ‘నమస్తే ఇండియా’ వారికి తానా బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.