Gadgets - ఆండ్రాయిడ్ 17 వచ్చేసింది - ఏఐతో మొబైల్ ప్రపంచంలో సరికొత్త విప్లవం..
వాయిస్ కమాండ్‌తో కిరాణా సామాన్ల ఆర్డర్ - ఆండ్రాయిడ్ 17 క్రేజీ ఫీచర్..
పిక్సెల్, శామ్సంగ్ ఫోన్లకు మొదటగా ఛాన్స్…
Android17: గూగుల్ సంస్థ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 17ను అధికారికంగా విడుదల చేసింది. గూగుల్ ఐ/ఓ (Google I/O) ఈవెంట్లో భాగంగా ప్రస్తుతం దీనిని బీటా వెర్షన్లో అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే గూగుల్ పిక్సెల్ మరియు శామ్సంగ్ ఎస్26 అల్ట్రా వంటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ఇది పూర్తిస్థాయిలో రానుంది. ఈసారి ఆండ్రాయిడ్ 17లో విజువల్ మార్పుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంపై గూగుల్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు ధీటుగా 'గూగుల్ ఇంటెలిజెన్స్' పేరుతో జెమిని ఏఐని ఫోన్ లోని ప్రతి విభాగంతోనూ అనుసంధానించారు.
ఈ కొత్త వెర్షన్లో జెమిని ఏఐ మన రోజువారీ పనులను ఎంత సులభతరం చేస్తుందో వివరిస్తూ కొన్ని అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేశారు. ఉదాహరణకు, మీరు కేవలం ఒక వాయిస్ కమాండ్ ఇస్తే చాలు, జెమిని మీ కిరాణా సామాన్లను ఆటోమేటిక్‌గా ఆర్డర్ చేస్తుంది. మీ ఫోన్ లోని నోట్స్ ఆధారంగా క్వాంటిటీని కూడా అదే నిర్ణయించి, బయోమెట్రిక్ సాయంతో పేమెంట్స్ కూడా పూర్తి చేస్తుంది. విద్యార్థుల కోసం మెయిల్స్‌లోని సిలబస్‌ను బట్టి పుస్తకాలను అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలో కార్ట్‌లోకి చేర్చి ఆర్డర్ చేసే వెసులుబాటు కూడా ఉంది. దీనివల్ల యూజర్లు తమ ప్రమేయం లేకుండానే పనులను బ్యాక్‌గ్రౌండ్‌లో చక్కబెట్టుకోవచ్చు.
క్రోమ్ బ్రౌజర్లో 'ఏజెంటిక్ బ్రౌజింగ్' అనే సరికొత్త ఫీచర్ యూజర్లకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయగానే దాని సారాంశాన్ని క్షణాల్లో మన ముందు ఉంచుతుంది. సినిమా టిక్కెట్లు బుక్ చేయాలనుకున్నప్పుడు అది మీకు సహాయపడటమే కాకుండా, మీరు వెళ్ళబోయే థియేటర్ దగ్గర పార్కింగ్ స్లాట్లను కూడా ముందుగానే రిజర్వ్ చేసి పెడుతుంది. ఫారాలు నింపేటప్పుడు కూడా సందర్భాన్ని బట్టి 'స్మార్ట్ ఫిల్' సాయంతో డేటాను ఆటోమేటిక్‌గా నింపుతుంది. మెసేజింగ్‌లో కూడా ప్రాంతీయ భాషలకు సపోర్ట్ ఇస్తూ, మనం మాట్లాడే వాయిస్ మెసేజ్‌లను నీట్ గా సారాంశం చేసి పంపే సదుపాయం కల్పించారు.
ఆండ్రాయిడ్ కస్టమైజేషన్ అంటే ఇష్టపడే వారి కోసం వాయిస్ కమాండ్‌తో విడ్జెట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించారు. కేవలం మీ గొంతుతోనే వాల్ క్లాక్, టెంపరేచర్, లేదా టాస్క్ లిస్ట్ వంటి వాటిని స్క్రీన్ మీద సెట్ చేసుకోవచ్చు. అలాగే, ఇన్నాళ్లు ఐఫోన్ యూజర్లకు మాత్రమే ఉన్న ఇన్స్టాగ్రామ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందనుంది. మెటాతో గూగుల్ జతకట్టడం వల్ల హై క్వాలిటీ ఫోటోలు, వీడియో అప్లోడ్లు మరియు నైట్ మోడ్ సపోర్ట్ మెరుగుపడనున్నాయి. ఇవే కాకుండా, 3డీ రియలిస్టిక్ ఎమోజీలు మన సంభాషణలకు మరింత అందాన్ని ఇవ్వనున్నాయి.
ఆండ్రాయిడ్ 17లో ప్రైవసీ మరియు ఫైల్ ట్రాన్స్ఫర్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఎయిర్ డ్రాప్ తరహాలో ఆండ్రాయిడ్ నుండి ఆపిల్ ఫోన్లకు నేరుగా డేటా ట్రాన్స్ఫర్ చేయడం ఇకపై సులభం కానుంది. బ్యాంకింగ్ స్కామ్ కాల్స్‌ను ఏఐ గుర్తించి, అది ఫ్రాడ్ కాల్ అయితే ఆటోమేటిక్‌గా కట్ చేసే సెక్యూరిటీని కూడా జోడించారు. ఆండ్రాయిడ్ ఆటోలో భాగంగా కారు పార్క్ చేసినప్పుడు యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలను డాల్బీ అట్మోస్ సౌండ్‌తో చూసే అవకాశం కల్పించారు. మొత్తానికి, ఆండ్రాయిడ్ 17 స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని పూర్తిగా మార్చివేస్తూ ఒక తెలివైన వ్యక్తిగత సహాయకుడిలా పని చేయనుంది.