తిరుపతిలో మరోసారి సైబర్ నేరగాళ్లు తమ చాకచక్యాన్ని ప్రదర్శించి ఇద్దరు వ్యక్తులను కోటిన్నర రూపాయల మేర మోసం చేశారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని డీమార్ట్ సమీపంలో నివసించే చైతన్య కుమార్, వెంకటేష్ అనే వ్యక్తులకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆన్లైన్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి "అంగారి ట్రేడ్ యాప్" అనే పేరుతో ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించాడు.
అతని మాటలకు మోసపోయిన బాధితులు ఆ యాప్‌లో పెట్టుబడిగా కోటి రూపాయలు జమ చేశారు. మొదట్లో యాప్‌లో పెద్ద ఎత్తున లాభాలు చూపించడంతో వారికి నమ్మకం పెరిగింది. లాభం వచ్చిన మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం డబ్బు వారి ఖాతాలో జమ కాలేదు. ఇది చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
డబ్బు రాకపోవడంతో ఆ వ్యక్తిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని గమనించారు. ఆ సమయంలోనే మోసపోయామని గ్రహించిన చైతన్య, వెంకటేష్ వెంటనే తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల కాలంలో ఇలాంటి ఆన్లైన్ ట్రేడింగ్ యాప్‌లు పేరుతో అనేక మంది మోసపోతున్నారు. అధిక లాభాలు వస్తాయని చెప్పి నకిలీ యాప్‌లు రూపొందించి ప్రజల సొమ్ము కొల్లగొడుతున్నారు. నిపుణులు ప్రజలను హెచ్చరిస్తూ, ఏ పెట్టుబడి పెట్టే ముందు ఆ యాప్ లేదా వెబ్సైట్ నిజమైనదో కాదో నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
ఇకపోతే, పోలీసులు కూడా ఇలాంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలు ఇలాంటి ఆఫర్లకు ఆకర్షితులవకుండా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద చర్యలు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.