ఒడిశాకు చెందిన ఒక ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. పాచిపెంట మండలం రొడ్డ వలస సమీపంలో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున సుమారు 35 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుండి బయలుదేరిన బస్సు, జయపుర్ వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్ని బస్సు మొత్తాన్ని చుట్టేసింది.
డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో మొదట పొగ రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనం ఆపి, ప్రయాణికులను కిందికి దించాడు. ఆయన చాకచక్యంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కొద్ది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయి బూడిదగా మారింది. కానీ ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం పెద్ద అదృష్టంగా చెప్పాలి.
ఈ ఘటనకు కారణం బస్సు ఇంజిన్ ఒత్తిడి పెరగడమేనని ప్రాథమిక సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే బస్సు మొత్తం దగ్ధమైపోయింది. రహదారిపై పొగ ముసురడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు.
ఇలాంటి ఘటనలు గతంలో కూడా సంభవించిన విషయం తెలిసిందే. ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి బస్సు మంటల్లో కాలిపోయి 41 మంది సజీవదహనం అయ్యారు. ఆ ఘటన తర్వాత ఆర్టీఓ అధికారులు ప్రైవేట్ బస్సులపై భారీ తనిఖీలు చేపట్టారు. అయినప్పటికీ, అగ్ని ప్రమాదాలు పూర్తిగా తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ తాజా ఘటన నేపథ్యంలో బస్సుల టెక్నికల్ చెకప్, ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ పరిశీలన వంటి భద్రతా చర్యలను తప్పనిసరి చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో 35 మంది ప్రాణాలు రక్షించగలిగినప్పటికీ, ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకూడదని ప్రజలు కోరుతున్నారు.