కెనడా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానాలు..
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను నియంత్రించేందుకు చర్యలు..
కెనడా: అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రసిద్ధిగాంచిన కెనడాలో స్టడీ పర్మిట్ల జారీ భారీగా పడిపోయింది. 2025లో కేవలం 75,372 కొత్త స్టడీ పర్మిట్లకే అనుమతులు లభించాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 64 శాతం తగ్గుదల కాగా, కోవిడ్ సమయంలో కంటే కూడా 18 శాతం తక్కువగా ఉండటం గమనార్హం.
ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణం కెనడా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానాలేనని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను నియంత్రించేందుకు ప్రవేశాలపై పరిమితులు (క్యాప్) విధించడం, ఇతర కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ చర్యలు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రభావం చూపినట్టు తాజాగా వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.
కెనడా ఆడిటర్ జనరల్ కార్యాలయం విడుదల చేసిన నివేదికలో ప్రభుత్వ అంచనాలు తప్పాయని స్పష్టం చేసింది. స్టడీ పర్మిట్ ఆమోదాల రేటు ఎందుకు తగ్గిందో కూడా ప్రభుత్వం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందని పేర్కొంది.
ఇమిగ్రేషన్, రిఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ తగ్గుదలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి — విదేశీ విద్యార్థుల ఆసక్తి తగ్గిపోవడం. రెండోది — దరఖాస్తుల ఆమోదాల శాతం గణనీయంగా పడిపోవడం.
2024తో పోలిస్తే 2025లో స్టడీ పర్మిట్ కోసం వచ్చిన దరఖాస్తులు 55 శాతం తగ్గాయి. 2021లో 57.9 శాతం ఉన్న ఆమోద రేటు, 2024లో 44.9 శాతానికి పడిపోయి, 2025లో మరింతగా తగ్గి 35.7 శాతానికి చేరింది. ఈ పరిస్థితిని చూసి చాలామంది విద్యార్థులు ముందుగానే ఇతర దేశాలను పరిశీలిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
కెనడా అంతర్జాతీయ విద్యార్థుల ప్రోగ్రామ్ ప్రతిష్ట ను ఈ విధానాలు దెబ్బతీస్తున్నాయని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. ప్రావిన్సులు, విద్యాసంస్థలతో సరైన సమన్వయం లేకుండా తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా విద్యార్థుల నమోదు సంఖ్యను తీవ్రంగా ప్రభావితం చేశాయని పేర్కొంది.
కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా క్యూబెక్ వంటి ప్రదేశాల్లో పెద్ద సమస్యలు లేకపోయినా, దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయడం వల్ల అన్ని యూనివర్సిటీలు దెబ్బతిన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. నిర్ణయాల విషయంలో కేంద్రం, రాష్ట్రాలు, విద్యాసంస్థల మధ్య సరైన చర్చలు జరగలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో కమిటీ మొత్తం 10 సూచనలు చేసింది. ముఖ్యంగా, భవిష్యత్‌లో అంతర్జాతీయ విద్యార్థుల విధానాలపై నిర్ణయాలు తీసుకునే ముందు ప్రావిన్సులు, ప్రాంతీయ ప్రభుత్వాలతో విస్తృతంగా చర్చించాలని సూచించింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సమస్య కేవలం ఇమిగ్రేషన్ పరిమితి కాదు. దేశ భవిష్యత్ ఆర్థికాభివృద్ధి, ప్రతిభావంతుల ఆకర్షణ, పరిశోధన రంగాల అభివృద్ధితో ఇది ముడిపడి ఉంది. సరైన ప్రణాళికలు లేకపోతే కెనడా గ్లోబల్ ఎడ్యుకేషన్ రంగంలో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా చూస్తే కెనడా తీసుకున్న కఠిన నిర్ణయాలు అంతర్జాతీయ విద్యార్థులపై మాత్రమే కాకుండా, దేశ విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతున్నాయి. భవిష్యత్‌లో సమతుల్య విధానాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.