హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన నటి కరాటే కల్యాణిపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సిద్ధమౌని నరేందర్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. లక్కీ డ్రా పేరుతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్న వ్యవహారాన్ని బయటపెట్టినందుకు, నిందితుడు ఆమెపై భౌతిక దాడికి దిగినట్లు పోలీసులు ధృవీకరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది.
సిద్ధమౌని నరేందర్ అనే యూట్యూబర్ సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకుని కొత్త రకమైన మోసానికి తెరలేపాడు. కేవలం రూ. 399 చెల్లిస్తే చాలు.. ఫార్చ్యూనర్ కారు, ఖరీదైన ఐఫోన్లు, బైకులు గెలుచుకోవచ్చంటూ లక్కీ డ్రా ప్రచారాన్ని మొదలుపెట్టాడు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పేరును వాడుకుంటూ భక్తుల సెంటిమెంట్‌తో ఆడుకున్నాడని, ఇది పూర్తిగా అక్రమమని కరాటే కల్యాణి గతంలోనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తక్కువ ధరకే లగ్జరీ వస్తువులు వస్తాయని నమ్మి వేలాది మంది అమాయకులు అతనికి డబ్బులు పంపినట్లు సమాచారం. నరేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ప్లాన్ చేసిన కల్యాణి, పోలీసులతో కలిసి రంగంలోకి దిగారు. ఆదిభట్ల సమీపంలోని వండర్లా పార్క్ వద్ద నరేందర్ తన అనుచరులతో కలిసి లక్కీ డ్రా ప్రచారం నిర్వహిస్తుండగా కల్యాణి అక్కడికి చేరుకున్నారు.
తన మోసం బయటపడుతుందని భయపడిన నరేందర్ మరియు అతని 10 మంది అనుచరులు కల్యాణిపై దాడికి యత్నించారు. ఆమె చున్నీ లాగి అసభ్యంగా ప్రవర్తించారని, ప్రాణహాని తలపెట్టేలా వ్యవహరించారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్యాణి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పంజాగుట్ట పోలీసులు నరేందర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 74, 75, 79 (మహిళల పట్ల అసభ్య ప్రవర్తన), 115(2), 132, 351(2), 352 కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో నరేందర్‌కు పాత నేరచరిత్ర ఉన్నట్లు తేలింది. గతంలో మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై చైన్ స్నాచింగ్ కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
సోషల్ మీడియాలో కనిపించే ప్రతి లక్కీ డ్రా నిజం కాదు. తక్కువ ధరకే కారు వస్తుందంటే దాని వెనుక ఏదో మోసం ఉండే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు. కరాటే కల్యాణి ధైర్యంగా ముందుకు వచ్చి ఈ మోసాన్ని అడ్డుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.