తాజా మొంథా తుఫాన్‌తో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇళ్లను కోల్పోయిన వారు, ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారికి ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం తీసుకున్న ప్రజలకు ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక అండగా నిలవాలని నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి బాధిత కుటుంబానికి రూ.1000 చొప్పున నగదు సాయం అందించనున్నారు. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉంటే గరిష్ఠంగా రూ.3 వేల వరకు ఇవ్వాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో చక్కెర, కూరగాయలు అందించనున్నారు. మత్స్యకార కుటుంబాలకు మాత్రం 50 కిలోల బియ్యం ప్రత్యేకంగా కేటాయించారు.
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కూరగాయల సరఫరా, ఆహార పంపిణీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏలూరు, కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో అన్నక్యాంటీన్ నెట్వర్క్, హరేకృష్ణ మూవ్మెంట్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత భోజన సేవలు కూడా అందిస్తున్నారు.
ప్రభుత్వ అధికారులు తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా అంటువ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజల ఇబ్బందులు తగ్గే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయి. అవసరమైతే అదనపు బృందాలను కూడా పంపుతాం అని ఒక జిల్లా అధికారులు వెల్లడించారు.
తుఫాన్ తర్వాత పరిస్థితులు స్థిరపడుతుండగా, ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. ముంపు ప్రభావం ఎదుర్కొన్న కుటుంబాలు ఈ సాయంతో కొంత ఊరట పొందుతాయని అంచనా.