ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లండన్లో జరిగిన ప్రపంచ స్థాయి World Travel Market–2025 (WTM) పర్యాటక ఎగ్జిబిషన్లో రాష్ట్ర పర్యాటక సామర్ధ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా పరిచయం చేశారు. మూడు రోజుల పాటు సాగిన ఈ అంతర్జాతీయ వేడుకలో పర్యాటక రంగానికి చెందిన ప్రపంచ దేశాల నిపుణులు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ప్రదర్శన ముగిసిన అనంతరం ఇండియన్ హై కమిషన్ నిర్వహించిన హైటీ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలో ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ పెట్టుబడిదారులకు ప్రత్యక్ష ఆహ్వానం అందించారు.
కార్యక్రమంలో ప్రసంగించిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, భవిష్యత్తు అంతా పర్యాటకానిదే. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, పెట్టుబడులు ఈ మూడు అంశాలను వేగంగా అభివృద్ధి చేసేది టూరిజమే అని పేర్కొన్నారు. పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక హోదా కల్పించిందని, రాష్ట్రానికి కొత్త టూరిజం పాలసీని విడుదల చేసినట్లు తెలిపారు. ఏపీకి రండి… మా పర్యాటక ప్రదేశాలు స్వయంగా చూసి వెళ్లండి… పర్యాటక మరియు ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టండి… పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి భద్రతగా ఉండే బాధ్యత మా ప్రభుత్వానిదే, అని పెట్టుబడిదారుల్ని ఉద్దేశించి చెప్పారు.
తన ప్రసంగంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యను మరలా గుర్తు చేస్తూ
కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం కంటే టూరిజానికే భవిష్యత్తు ఉంది, అని సీఎం చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచం నిజం చేస్తున్నదని అన్నారు. పర్యాటక రంగంలో ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడంలో ప్రభుత్వం ఇప్పటికే ఫలితాలు సాధించిందని, కేవలం 15 నెలల్లోనే రూ.12 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించగలిగామని మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, బీచ్ టూరిజం విస్తృతంగా అభివృద్ధి చెందేందుకు సరైన భౌగోళిక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా వెల్నెస్ సెంటర్లు, ఆయుర్వేద కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని, ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎకో టూరిజం అభివృద్ధిపై స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ పెట్టుబడిదారులు AP లో పర్యాటక అవకాశాల గురించి ఆసక్తిగా ప్రశ్నలు అడగగా, మంత్రి దుర్గేష్ ప్రతి ప్రశ్నకు స్పష్టమైన వివరాలతో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న Summit కు అందరినీ ఆహ్వానించారు.
తన ప్రసంగాన్ని ముగించిన దుర్గేష్,
భిన్న జాతులు, భిన్న సంస్కృతుల సమ్మేళనమే భారతం. ఐకమత్యమే మా బలం… వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్నాం,” అని అన్నారు. కార్యక్రమంలో భారతదేశము జై అంటూ ఆయన ముగింపు పలికారు. మూడు రోజుల లండన్ పర్యటన విజయవంతంగా ముగించుకొని మంత్రి దుర్గేష్ ఏపీకి తిరుగు ప్రయాణం అయ్యారు.