ముఖం మీద వయసు చూపించకుండా యవ్వనాన్ని మళ్లీ పొందాలనుకునే వారికి ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ సర్జరీ అనే చికిత్స ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా 25 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో ఈ సర్జరీ కోసం ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల ఒక సర్వే ప్రకారం, భారతదేశంలో 10 మందిలో 9 మంది కాస్మెటిక్ సర్జన్లు యువతీ యువకులు ఫేస్‌లిఫ్ట్ కోసం విచారణలు పెరుగుతున్నాయని తెలిపారు.
ఫేస్‌లిఫ్ట్ అంటే ముఖంలో వయస్సు వల్ల వచ్చే సడలిన చర్మం, డబుల్ చిన్, ముడతలు, జాలైన్ వద్ద ఏర్పడే లూజ్ స్కిన్ వంటి సమస్యలను సరిచేసే సర్జరీ. ఈ చికిత్సలో డాక్టర్ ముఖంలోని అదనపు చర్మాన్ని తొలగించి, లోపలి కండరాలను బిగించి, చర్మాన్ని సహజంగా తిరిగి అమర్చుతారు. దీంతో ముఖానికి టోన్ తిరిగి వస్తుంది, యవ్వనంగా కనిపిస్తుంది. అయితే ఫైన్ లైన్స్ లేదా కనుబొమ్మల సడలింపు, కంటి పైభాగం చర్మం తగ్గడం వంటి సమస్యలకు ఇది సరిపోడు. వాటికి బ్రౌ లిఫ్ట్ లేదా ఐ లిఫ్ట్ వంటి వేరే సర్జరీలు అవసరం.
ఫేస్‌లిఫ్ట్ సర్జరీ నైపుణ్యం కలిగిన ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేయగలరు. ముందుగా రక్తపరీక్షలు, మెడికల్ క్లియరెన్స్ తీసుకుని రోగికి అనస్థీషియా ఇస్తారు. సర్జరీ సమయం సాధారణంగా 2 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. చర్మాన్ని కోయే ప్రాంతాలు జుట్టు మొదలయ్యే దగ్గర లేదా చెవి చుట్టూ ఉంటాయి. తర్వాత చర్మాన్ని లోపలి కండరాల నుండి వేరు చేసి, వాటిని బిగించి, అదనపు కొవ్వును తీసి మిగిలిన చర్మాన్ని సహజంగా అమర్చుతారు.
ఫేస్‌లిఫ్ట్ సర్జరీలకు పలు రకాలుంటాయి ట్రడిషనల్ ఫేస్‌లిఫ్ట్ ముఖం కింద భాగం, మెడ ప్రాంతంలో ఎక్కువ మార్పు ఇస్తుంది. దీని ఫలితాలు 10 సంవత్సరాలకు పైగా ఉంటాయి. మినీ ఫేస్‌లిఫ్ట్ తక్కువ ఇన్వేసివ్ పద్ధతి, చెంపలు మరియు జాలైన్‌పై ఫోకస్ ఉంటుంది. ఇది 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఫలితాలు ఇస్తుంది. మిడ్ ఫేస్‌లిఫ్ట్ కళ్ల కింద భాగం, చెంపలపై ప్రభావం చూపుతుంది. డీప్ ప్లేన్ ఫేస్‌లిఫ్ట్ మాత్రం లోతైన కండరాలపై పని చేస్తుంది, దీని ఫలితాలు 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటాయి.
శస్త్రచికిత్స చేయించాలనిపించని వారు నాన్ సర్జికల్ పద్ధతులను ఎంచుకుంటున్నారు. వాటిలో థ్రెడ్ లిఫ్ట్, లిక్విడ్ ఫేస్‌లిఫ్ట్ ప్రధానమైనవి. థ్రెడ్ లిఫ్ట్‌లో చర్మం కింద సన్నని ధాగాలు వేసి బిగిస్తారు. లిక్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఫిల్లర్లు లేదా బోటాక్స్ వాడి చర్మాన్ని తాత్కాలికంగా టైట్‌గా ఉంచుతారు. ఇవి సాధారణంగా 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు మాత్రమే ప్రభావం చూపుతాయి.
ఫేస్‌లిఫ్ట్ సర్జరీ వల్ల ముఖం 5 నుంచి 15 సంవత్సరాలు యవ్వనంగా కనిపిస్తుంది. చెంపలు, జాలైన్ స్పష్టంగా ఉంటాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్, బ్లీడింగ్, గాయం మచ్చలు లేదా నర్వ్ డ్యామేజ్ వంటి ప్రమాదాలు ఉండొచ్చు.
ఫేస్‌లిఫ్ట్ చేయించాలనుకునేవారు తప్పనిసరిగా సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ వద్ద మాత్రమే చేయించాలి. తక్కువ ఖర్చు కోసం అనుభవం లేని వైద్యుల వద్ద సర్జరీ చేయించుకోవడం ప్రమాదకరం. ప్రతి వ్యక్తి చర్మం, ఆరోగ్య పరిస్థితి వేరుగా ఉంటుంది కాబట్టి, డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
గమనిక: ఇది ఆరోగ్యంపై సాధారణ సమాచారం మాత్రమే. వైద్య సలహాగా పరిగణించరాదు. మీ వ్యక్తిగత పరిస్థితికి సరిపోయే చికిత్స కోసం నిపుణుడిని సంప్రదించండి.