IPL 2026: ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే కూడా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ప్రపంచ స్థాయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదడం విశేషం.
మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చూపిన క్రీడాస్ఫూర్తి అందరి మనసు గెలుచుకుంది. తన జట్టు ఓడిపోయినప్పటికీ, ఆ బాధను పక్కన పెట్టి కుర్రాడు వైభవ్ దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా అభినందించాడు. మైదానంలో ప్రత్యర్థులైనా, బయట ఒక మంచి ఆటగాడిని గౌరవించడం హార్దిక్ గొప్పతనాన్ని చాటిచెప్పింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైభవ్ బ్యాటింగ్ గురించి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. "15 ఏళ్ల వయసులో ఇంత భయం లేకుండా ఆడటం నిజంగా అద్భుతం. మ్యాచ్‌కు ముందు మేము అతని గురించి చాలా చర్చించుకున్నాం. అతను ఆడే షాట్లు, బ్యాటింగ్‌లో చూపిస్తున్న తెగువ చూస్తుంటే ముచ్చటేస్తోంది. భవిష్యత్తులో అతను ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. ఒక సీనియర్ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రోత్సాహం లభించడం ఆ కుర్రాడికి పెద్ద బూస్ట్ అని చెప్పాలి.
ఇక ఆట విషయానికొస్తే, రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే సిక్సర్ల వర్షం కురిపించారు. జైస్వాల్ 32 బంతుల్లోనే 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి కేవలం 2.4 ఓవర్లలోనే జట్టు స్కోరును 50 మార్కుకు చేర్చారు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లు ఈ విధ్వంసాన్ని ఆపలేక చేతులెత్తేశారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తడబడింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు తక్కువ పరుగులకే వెనుదిరగడంతో ముంబై కష్టాల్లో పడింది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ పోరాడినప్పటికీ రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 123 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా రాజస్థాన్ 27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.