ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్ నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్శిటీ (NTU) శాస్త్రవేత్తలు కొత్త ఆలోచనను ముందుకు తెచ్చారు. భూమిపై ఉన్న డేటా సెంటర్ల వల్ల పెరుగుతున్న విద్యుత్ వినియోగం కార్బన్ ఉద్గారాలను తగ్గించే దిశగా వారు అంతరిక్షంలో కార్బన్-న్యూట్రల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ప్రపంచ వ్యాప్తంగా డేటా సెంటర్లు పనిచేయడానికి విపరీతమైన విద్యుత్ అవసరం. సింగపూర్‌లో మాత్రమే వీటి వినియోగం దేశ విద్యుత్‌లో దాదాపు 7 శాతం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి NTU బృందం స్పేస్ డేటా సెంటర్ కాన్సెప్ట్‌ను రూపొందించింది. ఈ సెంటర్లు భూమిపై కాకుండా కక్ష్యలో ఉండి సౌరశక్తితో పనిచేస్తాయి.
శాస్త్రవేత్తల ప్రకారం అంతరిక్షంలో శీతలీకరణకు అవసరమైన ఉష్ణోగ్రత సహజంగానే లభిస్తుంది సుమారు మైనస్ 270°C వరకు ఉండే దీప అంతరిక్ష ఉష్ణోగ్రత డేటా సర్వర్లకు అత్యుత్తమమైన కూలింగ్ వాతావరణాన్ని అందిస్తుంది. ఈ విధానం ద్వారా అదనపు విద్యుత్ వినియోగం లేకుండా డేటా ప్రాసెసింగ్ సాధ్యమవుతుందని వారు వివరించారు.
NTUలో ప్రొఫెసర్ వెన్ యోంగ్‌గాంగ్ మాట్లాడుతూ అంతరిక్షం సుస్థిర కంప్యూటింగ్‌కు ఒక కొత్త వేదిక. సౌరశక్తి, సహజ చల్లదనం కలిస్తే పూర్తిగా కార్బన్ రహిత డేటా వ్యవస్థను సృష్టించవచ్చు అని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్‌లో రెండు ప్రధాన మోడళ్లు ఉన్నాయని బృందం తెలిపింది.
1. ఆర్బిట్ ఎడ్జ్ డేటా సెంటర్లు (Orbit Edge Data Centers) – ఉపగ్రహాలు నేరుగా అంతరిక్షంలోనే డేటాను ప్రాసెస్ చేస్తాయి.
2. ఆర్బిటల్ క్లౌడ్ డేటా సెంటర్లు (Orbital Cloud Data Centers) – ఉపగ్రహాల సమూహం కలిసి పెద్ద పరిమాణంలో కంప్యూటింగ్ పనులను నిర్వహిస్తుంది.
NTU వైస్ ప్రెసిడెంట్ (ఇన్నోవేషన్ & ఎంట్రప్రెన్యూర్‌షిప్) ప్రొఫెసర్ లూయిస్ ఫీ మాట్లాడుతూ సుస్థిరత మరియు ఆవిష్కరణలను కలిపే ప్రయత్నం ఇది. అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల సాంకేతిక అభివృద్ధి మాత్రమే కాదు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కూడా కొత్త అవకాశాలు తెరుచుకుంటాయిఅని అన్నారు.
పరిశోధకుల అంచనా ప్రకారం రాకెట్ ప్రయోగాల వల్ల ఉత్పత్తి అయ్యే ఉద్గారాలు కూడా కొద్ది సంవత్సరాల్లో సమతుల్యం అవుతాయని, ఆ తర్వాత ఈ సెంటర్లు పూర్తిగా స్వచ్ఛ శక్తితో పనిచేస్తాయని తెలిపారు.
భవిష్యత్తులో పెరుగుతున్న కంప్యూటింగ్ అవసరాలను తీర్చడంలో పర్యావరణానికి హాని కలగకుండా ఉండే మార్గంగా ఈ ఆలోచనను నిపుణులు చూస్తున్నారు. అంతరిక్షంలో డేటా సెంటర్లు ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు సుస్థిర టెక్నాలజీ దిశగా మరో బలమైన అడుగు.