ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి శుభవార్త అందించారు. ఉద్యోగులకు ఒక నెల కరువు భత్యం (డీఏ) పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. పెంచిన డీఏను నవంబర్ 1వ తేదీ నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో సమావేశమైన అనంతరం సీఎం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.

తాజా డీఏ పెంపు నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి నెలా రూ. 160 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని, అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. "ఉద్యోగులంతా సంతోషంగా దీపావళి జరుపుకోవాలి. ఈ ఉత్సాహంతో రేపటి నుంచి మరింత బాగా పనిచేస్తారని ఆశిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కేవలం డీఏ పెంపు మాత్రమే కాకుండా పలు ఇతర అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. పోలీసు సిబ్బందికి సంబంధించిన ఈఎల్ బకాయిల్లో మొదటి విడతగా రూ. 105 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని, మిగిలిన మొత్తాన్ని జనవరిలో చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే, ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సింగిల్ ప్రమోషన్‌ను దీపావళి కంటే ముందే పూర్తి చేస్తామని ప్రకటించారు.
ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన వ్యవస్థలను 60 రోజుల్లో క్రమబద్ధీకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు వంటి కీలక అంశాలపై త్వరలోనే చర్చించి పరిష్కరిస్తామని, ఈ విషయాల్లో ఎలాంటి దాపరికం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు.
సంపద సృష్టిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఎం, ఉద్యోగుల సహకారంతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.