దోహా నగరంలో అంగరంగ వైభవంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు..
తరలివచ్చిన వందలాది మంది తెలుగు ప్రజలు..
ఖతార్‌లోని దోహా నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఎన్ఆర్ఐ టీడీపీ – ఖతార్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు ప్రజలు భారీగా హాజరై ప్రత్యేక ఉత్సాహాన్ని నింపారు.
ఖతార్ లోని అల్ ఖోర్, దుఖాన్ ఇండస్ట్రియల్ ప్రాంతం, మెసైద్ ఇండస్ట్రియల్ ఏరియా, అల్ వక్రతో పాటు దోహా పరిసర ప్రాంతాల నుండి వందలాది మంది తెలుగు ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన జూమ్ సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వర్చువల్ కార్యక్రమంలో గౌతు సిరిష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు మరియు ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు డా. రవి కుమార్ వేమూరు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చిరాం ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ టీడీపీ ఖతార్ ఉపాధ్యక్షుడు మద్దిపోటీ నరేష్ నాయకత్వం వహించగా, జనరల్ సెక్రటరీ రవి పొనుగుమాటి సమన్వయం చేశారు. ఖజాంచి విక్రమ్ సుఖవాసి, సోషల్ మీడియా ఇంచార్జి గోవర్ధన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. జీసీసీ కౌన్సిల్ సభ్యుడు మల్లిరెడ్డి సత్యనారాయణతో పాటు సీనియర్ నాయకులు బొడ్డు రామారావు, జేవీవీ సత్యనారాయణ, సుధాకర్ కోడాలి, నరేష్ నూతలపాటి, మల్లీశ్వరరావు, మూర్తి, శ్రీనివాసరావు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. “లాంగ్ లివ్ బాబు గారు” అనే నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి దృష్టి, ప్రజా సేవలు, నాయకత్వాన్ని ప్రశంసించారు. విదేశాల్లో ఉన్నా తమ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికీ తోడ్పాటునిస్తామని ప్రవాసులు పేర్కొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం సందడిగా సాగింది. మొత్తంగా ఈ వేడుకలు ఖతార్‌లోని తెలుగు సమాజం ఐక్యతను, తమ నాయకుడిపై ఉన్న అపారమైన అభిమానాన్ని ప్రతిబింబిస్తూ ఉత్సాహభరితంగా విజయవంతంగా ముగిశాయి.