ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలను భంగం చేసేందుకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్నా లేకపోయినా బూతులు తిట్టడం, కులాలు–మతాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ రాజకీయ సిద్ధాంతమని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ, సమాజంలో విషబీజాలు నాటడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తుకు జగన్ ఒక వైరస్‌లా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసిందని అనగాని తెలిపారు. చుక్క పాలు కూడా వాడకుండా జంతువుల కొవ్వుతో తయారు చేసిన సుమారు 60 లక్షల కేజీల కల్తీ నెయ్యిని వినియోగించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని సెట్ నివేదిక స్పష్టంగా వెల్లడించిందని, అయినా వైసీపీ నేతలు రిపోర్టులను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఇలాంటి అవినీతి జరగడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి పాత్రపై అనగాని తీవ్రంగా స్పందించారు. తప్పు బయటపడిన తర్వాత తనను తాను రక్షించుకోవడానికి తిరుపతిలో ఫ్లెక్సీలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీ పతనం చెందినా నాయకుల్లో ఎలాంటి మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. ‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్టుగా జగన్‌ను చూసే భూమన, అంబటి వంటి నేతలు కూడా అదే బాటలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, శాంతిని కాలరాస్తూ రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
విధ్వంసం కాదు, అభివృద్ధే తెలుగుదేశం పార్టీ ఎజెండా అని అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకు 20 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించడాన్ని శుభపరిణామంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తోట చంద్రయ్య, అమర్ హత్య కేసుల్లో బాధితులకు న్యాయం చేస్తామని, ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, తప్పు చేస్తే పార్టీతో సంబంధం లేకుండా ఎంతటివారైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. వైసీపీ బూతు రాజకీయాలను, కుట్రలను ప్రతి వేదికపై ప్రజల ముందుకు తీసుకెళ్తామని అనగాని తేల్చిచెప్పారు.