ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం పలు ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో జరగబోయే భాగస్వామ్య సదస్సు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, తుఫాన్ ప్రభావం, పెట్టుబడుల ఆమోదం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధాన చర్చా విషయాలుగా ఉండనున్నాయి.
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల అధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు రాబట్టే అవకాశం ఉండడంతో ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను ఇప్పటికే కొంతమంది మంత్రులకు అప్పగించిన సీఎం చంద్రబాబు, రేపటి కేబినెట్ సమావేశంలో ఏర్పాట్ల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రేపటి కేబినెట్ సమావేశంలో వీటికి అధికారిక ముద్ర వేయే అవకాశం ఉంది. అదేవిధంగా మొంథా తుఫాన్ ప్రభావం, తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలు, పునరావాస చర్యలు, రైతులకు పరిహారం వంటి అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు, అమరావతి రాజధాని నిర్మాణం కోసం NaBFID నుంచి రూ.7,500 కోట్ల రుణం తీసుకోవడానికి సీఆర్డీఏకు కేబినెట్ అనుమతి ఇవ్వవచ్చని సమాచారం.
ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా ఈ సమావేశంలో కీలక అంశంగా నిలవనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల సవరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదిక ఆధారంగా కేబినెట్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. మొత్తం మీద రేపటి కేబినెట్ సమావేశం ఆర్థిక, పరిపాలనా, రాజకీయ పరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.