ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైద్య రంగంలో మరో అద్భుతమైన శుభవార్త లభించింది. ఇకపై క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రాష్ట్రంలోనే ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండలో రూ.4,260 కోట్ల వ్యయంతో “చున్ జియోంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్”ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ సెంటర్‌ను దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం, చల్లా గ్రూప్, ఒమెక్సా బయాలజీస్, మేస్ మరియు ఐ హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.
విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం ఛైర్మన్ పీటర్ చున్, చల్లా గ్రూప్ అధినేత చల్లా ప్రసాద్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం 25 ఎకరాల విస్తీర్ణంలో 1,500 పడకల ఆసుపత్రి, మెడికల్ స్కూల్, హెల్త్ టెక్నాలజీ సెంటర్, క్యాన్సర్ మ్యూజియం, హెలిపోర్ట్, హోటల్, నివాస సముదాయాలు, పార్కులు మరియు బొటానికల్ గార్డెన్ వంటి అత్యాధునిక సదుపాయాలు నిర్మించనున్నారు.
ఈ స్మార్ట్ మెడికల్ సిటీ ప్రాజెక్టు ద్వారా కేవలం చికిత్సే కాకుండా, క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే ఆధునిక నిర్ధారణ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఒమెక్సా కో-ఫౌండర్ డాక్టర్ రాజన్ గార్గ్ మాట్లాడుతూ, పేదలకు ఉచితంగా ఆపరేషన్లు, చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఈ సెంటర్ ద్వారా లబ్ధి పొందనున్నారు. దాదాపు నాలుగు వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టు ద్వారా లభిస్తాయని అంచనా.
చల్లా గ్రూప్ అధినేత చల్లా ప్రసాద్ మాట్లాడుతూ, తన స్వస్థలమైన ప్రకాశం జిల్లాలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కావడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో మరికొన్ని పరిశ్రమలు, ప్రాజెక్టులు కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. పీటర్ చున్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వైద్య రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. అనుమతులు రాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో, ఈ అంతర్జాతీయ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ వైద్య రంగం మరింత బలపడనుంది. ఇకపై రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా తమ స్వస్థలంలోనే అధునాతన చికిత్సలు పొందే అవకాశం లభించనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, దొనకొండ ఆంధ్రప్రదేశ్ వైద్య మ్యాప్‌లో ఒక ప్రధాన కేంద్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.