ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో భారతీయ సాఫ్ట్‌వేర్ సేవల రంగం సంక్షోభంలో పడుతుందన్న ఆందోళనలపై టెక్నాలజీ రంగ అగ్రగామి సంస్థ 'నాస్కామ్' కీలక స్పష్టత ఇచ్చింది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయాందోళనలు కేవలం అపోహలేనని, వాస్తవానికి ఏఐ సాంకేతికత భారత ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, కొత్త పుంతలు తొక్కిస్తుందని నాస్కామ్ పేర్కొంది. టెక్నాలజీ సేవలను ఏఐ భర్తీ చేయదని, బదులుగా వాటి సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇటీవల కాలంలో ఆంత్రోపిక్ క్లాడ్ కోవర్క్ వంటి అధునాతన ఏఐ టూల్స్ మార్కెట్లోకి రావడంతో.. డేటా అనాలిసిస్, మార్కెటింగ్, సేల్స్ మరియు లీగల్ వంటి రంగాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీల ప్రాధాన్యత తగ్గుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఆందోళనలను నాస్కామ్ తోసిపుచ్చింది. గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ వాడే సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను ఏఐ ఒక్కటే నేరుగా నడపలేదని వివరించింది. ప్రతి వ్యాపార ప్రక్రియలోనూ 'హ్యూమన్-ఇన్-ది-లూప్' తప్పనిసరని, వ్యాపార వ్యూహాలను అర్థం చేసుకునే విజ్ఞానం మనుషులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
భారతీయ ఐటీ సంస్థలు కేవలం సర్వీస్ ప్రొవైడర్లుగా మాత్రమే మిగిలిపోకుండా, తమను తాము 'రీ-ఇన్వెంట్' చేసుకుంటున్నాయని నాస్కామ్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత వృద్ధికి మూడు ప్రధాన మార్గాలు
లెగసీ సిస్టమ్ మోడర్నైజేషన్: పాత సాంకేతిక వ్యవస్థలను ఏఐ సాయంతో ఆధునీకరించడం.
ఏఐ-రెడీ డేటా ఫౌండేషన్స్: కంపెనీల వద్ద ఉన్న అపారమైన డేటాను ఏఐ వినియోగానికి అనుగుణంగా మార్చడం.
ఇంటెలిజెంట్ ఏజెంట్స్: వ్యాపార కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు స్మార్ట్ ఏఐ ఏజెంట్లను ప్రవేశపెట్టడం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం కేవలం ప్రయోగాల దశలో ఉంది. ఇది భారీ స్థాయిలో అమల్లోకి వచ్చే క్రమంలో భారతీయ ఐటీ కంపెనీలు 'ఆర్కెస్ట్రేటర్స్' గా కీలక పాత్ర పోషిస్తాయని నాస్కామ్ అంచనా వేస్తోంది. క్లయింట్ల అవసరాలకు తగ్గట్టుగా కస్టమైజ్డ్ ఏఐ సొల్యూషన్లను రూపొందించడంలో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా మారనుందని పేర్కొంది. కేవలం సాఫ్ట్‌వేర్ కోడింగ్ రాయడమే కాకుండా, వ్యాపార సమస్యలకు ఏఐ ద్వారా పరిష్కారాలను చూపడమే మన ఐటీ కంపెనీల తదుపరి లక్ష్యమని నాస్కామ్ ఉద్ఘాటించింది.