ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన పాదయాత్రపై ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ చేస్తున్న ఈ యాత్ర ప్రజా ప్రయోజనాల కోసం కాదని, కేవలం కోల్పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడానికేనని ఆమె ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె, గత ఐదేళ్ల వైసీపీ పాలనలోని వైఫల్యాలను గుర్తు చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు లేని ప్రజాప్రేమ ఇప్పుడెందుకు?
షర్మిల తన విమర్శల్లో ప్రధానంగా జగన్ వ్యక్తిత్వాన్ని, ఆయన పాలనా విధానాన్ని టార్గెట్ చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ ఎప్పుడైనా ప్రజల మధ్యకు వచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులకే కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వని వ్యక్తి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తారని నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన నాయకుడు, అధికారం పోగానే రోడ్ల మీదకు రావడం రాజకీయ అవకాశవాదమేనని ఆమె కొట్టిపారేశారు.
వైఎస్సార్ ఆశయాలకు తూట్లు.. జలయజ్ఞం ఏమైంది?
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన 'జలయజ్ఞం' ప్రాజెక్టుల విషయంలో జగన్ నిర్లక్ష్యాన్ని షర్మిల ఎండగట్టారు. వైఎస్సార్ కలలుగన్న సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టులను వైసీపీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదని ఆమె అడిగారు. తండ్రి పేరు చెప్పుకుని ఓట్లు అడిగిన జగన్, ఆయన ఆశయాలను మాత్రం గాలికొదిలేశారని విమర్శించారు. అభివృద్ధిని విస్మరించి, కేవలం బటన్ నొక్కే కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు.
మద్యం నిషేధం పేరుతో భారీ దోపిడీ!
ఎన్నికల సమయంలో ఇచ్చిన 'మద్యం నిషేధం' హామీని జగన్ తుంగలో తొక్కారని షర్మిల ఆరోపించారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి, ఏరులై పారించారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం అమ్మకాలతో కోట్లాది రూపాయలు దోచుకున్నారు అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మద్యం కుంభకోణం వల్ల వేలాది మంది పేదల ప్రాణాలు గాలిలో కలిశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని కూడా వదలకుండా రిషికొండ లాంటి పర్యాటక ప్రాంతాలను ధ్వంసం చేసి 'బోడిగుండు' కొట్టించారని వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం జగన్ పాదయాత్ర వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదని, ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈ యాత్ర అని షర్మిల తేల్చిచెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను విస్మరించిన నాయకుడికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మొత్తానికి షర్మిల చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.