Telangana Birth Certificate: తెలంగాణలో జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియలో పెను మార్పులు రాబోతున్నాయి. సర్టిఫికేట్ల కోసం నెలల తరబడి వేచి చూసే కష్టాలకు చరమగీతం పాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) విధానాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సామాన్యులకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పడమే కాకుండా, పారదర్శకమైన సేవలు అందనున్నాయి.
ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే, దరఖాస్తు చేసుకున్న కేవలం 3 నుంచి 5 రోజుల్లోనే బర్త్ లేదా డెత్ సర్టిఫికేట్లు చేతికి అందుతాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో సాంకేతిక ఇబ్బందులు, క్షేత్రస్థాయి పరిశీలనలో జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, కొత్త పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులే స్వయంగా అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, ఫారాలను పూర్తి చేయవచ్చు. ఒకసారి అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత, ఆఫీసులకి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వెబ్‌సైట్ నుంచే సర్టిఫికేట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు.
ముఖ్యంగా 2023లో వచ్చిన జనన మరణాల నమోదు సవరణ చట్టం ప్రకారం.. బర్త్ సర్టిఫికేట్ అనేది కేవలం ఒక కాగితం ముక్క కాదు, అది ఒక వ్యక్తికి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. స్కూల్ అడ్మిషన్ మొదలుకొని, పాస్‌పోర్ట్ తీసుకోవడం, ఆధార్ కార్డు అప్డేట్ చేయడం, ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడం వంటి ప్రతి పనికీ జనన ధృవీకరణ పత్రం ఇప్పుడు ప్రామాణికంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ జారీ లేదా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కూడా పుట్టిన తేదీని నిరూపించుకోవడానికి ఇదే ఏకైక ఆధారమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు, మరణ ధృవీకరణ పత్రాల విషయంలోనూ ఈ పోర్టల్ ఎంతో ఊరటనివ్వనుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఆస్తి వారసత్వ బదిలీలు చేసుకోవాలన్నా, ఎల్ఐసీ (LIC) వంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. అలాగే భర్త చనిపోయినప్పుడు భార్యకు పెన్షన్ రావడం కోసం లేదా ఇతర బ్యాంకు లావాదేవీల క్లియరెన్స్ కోసం మరణ ధృవీకరణ పత్రం ఆలస్యం కాకుండా అందడం ఎంతో అవసరం. గతంలో ఆలస్యమైన నమోదుల (Late Registrations) కోసం కూడా ఈ కొత్త పోర్టల్‌లో ప్రత్యేక వెసులుబాటు కల్పించబోతున్నారు.
సాంకేతికతను అందిపుచ్చుకుని తెలంగాణ సర్కార్ తీసుకువస్తున్న ఈ విప్లవాత్మక మార్పుతో సామాన్యుడికి డిజిటల్ సేవలు మరింత చేరువ కానున్నాయి. క్షేత్రస్థాయిలో మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీ కార్యాలయాల్లో పనులు వేగవంతం అయ్యేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను డిజైన్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ పోర్టల్ పూర్తిస్థాయిలో లైవ్‌లోకి రానుంది. దీనివల్ల మధ్యవర్తుల బెడద తగ్గడంతో పాటు, సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు