పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా, వడ్డేశ్వరంలోని ప్రైమ్ హిల్ క్రెస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ప్రారంభించారు. తదనంతరం, 2025–26 నూనె సంవత్సరముకు గాను పామ్ ఆయిల్ గెలలు యొక్క ధరను లెక్కించే సూత్రాన్ని నిర్ణయించేందుకు, ఆయిల్ పామ్ ధరల నిర్ధారణ (Fixation) కమిటీ సమావేశం, మంత్రి గారి అధ్యక్షతన నిర్వహించబడింది.
ఈ నూతన కార్యాలయ ప్రారంభం ద్వారా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ పరిపాలనా కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతూ, రైతులకు మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయిల్ పామ్ పరిశ్రమ మరియు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆయిల్ పామ్ రంగానికి సంబంధించిన వివిధ కీలక అంశాలైన ఓ.ఇ.ఆర్. శాతం / నూనె శాతం (Oil Extraction Rate), పామ్ నట్ రికవరీలు, వంటి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆయిల్ పామ్ విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.97 లక్షల మంది రైతులు 2.49 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తుండగా, ఇది 24 జిల్లాలు, 371 మండలాలకు విస్తరించిందన్నారు. హెక్టారుకు సగటు 19.81 టన్నుల ఉత్పాదకతతో ఆయిల్ పామ్ రైతులకు మంచి ఆదాయం లభిస్తోందని, AP ఆయిల్ పామ్ చట్టం–1993, నియమాలు–2008 ప్రకారం అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తూ ఫ్యాక్టరీ జోన్ల కేటాయింపు, నాణ్యమైన మొక్కల సరఫరా, సాంకేతిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 24 కంపెనీలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, 15 ప్రాసెసింగ్ యూనిట్లు గంటకు 736 మెట్రిక్ టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్నారు. ఇండోనేషియా, మలేషియా, కోస్టారికా వంటి దేశాల నుండి దిగుమతి చేసిన నాణ్యమైన విత్తన మొలకలతో పాటు దేశవాళీ రకాల మొక్కలను రైతులకు అందిస్తున్నామని, 30 నర్సరీలు, మూడు సీడ్ గార్డెన్ల అభివృద్ధితో భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
2024–25 నూనె సంవత్సరానికి 19.42% OER అమలుతో మెట్రిక్ టన్నుకు సగటు రూ.19,579 ధర లభించగా, ఇది గత పదేళ్లలో అత్యధికమని, రైతుల్లో నమ్మకం పెరిగిందన్నారు. 2025–26లో 24,535 హెక్టార్లలో కొత్త తోటల విస్తరణ సాధించామని, ఇప్పటివరకు రూ.181.28 కోట్ల నిధులు విడుదల చేసి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ నూనె గింజల మిషన్ ద్వారా ఉచిత మొక్కలు, సాగు ప్రోత్సాహకాలు, అంతర పంటలకు సహాయం, బిందు సేద్యం పరికరాలపై రాయితీలు అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వ లక్ష్యసాధక నిర్ణయాలతో ఆయిల్ పామ్ రాష్ట్ర రైతులకు స్థిరమైన, లాభదాయక ఆదాయ పంటగా మారుతోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, ఉద్యానవన శాఖ సంచాలకులు శ్రీనివాసులు, ఉద్యాన అదనపు సంచాలకులు, ఆయిల్ పామ్ VC & MD, AP ఆయిల్ ఫెడ్, ఆయిల్ పామ్ రైతులు మరియు ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.