గత ఐదేళ్ల పాలనలో అస్తవ్యస్తంగా మారిన ఎక్సైజ్ శాఖను మళ్లీ గాడిలో పెట్టమని, రాష్ట్ర ప్రజల సంక్షేమం ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళగిరిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో ఎక్సైజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నాశనం చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన చేశామన్నారు.
ఎక్సైజ్ శాఖలో తీసుకున్న నిర్ణయాలు, పాలసీ అమలలో పారదర్శకత కారణంగా ఈ ఏడాది సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుండి స్వస్థలాలకు వచ్చిన వారితో రాష్ట్ర ఎక్సైజ్ పెరిగింది. గతంలో ప్రారంభించిన 'నవోదయం' కార్యక్రమం ద్వారా సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నాము. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) మరియు కల్తీ మద్యంపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
కల్తీ మద్యం వల్ల చిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతున్న ఉదంతాలు తనను కలిచివేసాయి. గతంలో జంగారెడ్డిగూడెంలో ఎంతో మంది చిన్న వయసులోనే వితంతువులుగా మారిన ఘటనలు చూసాను. అందుకే సారా నిర్మూలన విషయంలో అత్యంత కటినంగా వ్యవహరించడం, సారా రహిత రాష్ట్రంగా ఏపీని ప్రకటించడం సంతోషంగా ఉంది. మొలకలచెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఘటనల నేపథ్యంలో 'సురక్ష యాప్' వినియోగం ద్వారా శాఖపై ప్రజలకు నమ్మకం పెరిగింది.
ప్రతి బాటిల్ నాణ్యతను తనిఖీ చేసే వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. ఎక్సైజ్ శాఖలోని ఉద్యోగుల ప్రమోషన్లు ఇతర సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీతిగా, నిజాయితీగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్రమ మద్యం రవాణా చేసే వారిపై, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.