నెల్లూరు చరిత్రలో.. అపూర్వ ఘట్టంగా.. పార్టీ మహానాడు..
తుది వేదికను పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుంది : మంత్రి ఆనం..
నెల్లూరు: నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ విషయాన్ని వెల్లడిస్తూ, మహానాడును ప్రతి కార్యకర్త గర్వపడేలా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జిల్లా కార్యకర్తలకు ఎంతో గౌరవంగా భావిస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. ఈ కార్యక్రమం నెల్లూరు చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.
మహానాడు నిర్వహణకు అనువైన ప్రదేశాల ఎంపిక కోసం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేతృత్వంలో విస్తృతంగా స్థలాల పరిశీలన కొనసాగుతోంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి కోవూరు సమీపంలోని 110 ఎకరాల APIIC భూములు, రాజుపాలెం వద్ద ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంతం, నెల్లూరు రూరల్ పరిధిలోని జాతీయ రహదారి సమీప ప్రాంతాలను పరిశీలించారు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
పరిశీలించిన అన్ని వివరాలను పార్టీ కేంద్రానికి నివేదిస్తామని, అనంతరం పార్టీ అధిష్టానం తుది వేదికను ఖరారు చేస్తుందని మంత్రి ఆనం తెలిపారు.
మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా మే 28న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో మహానాడు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఐదు లక్షల మందికి పైగా కార్యకర్తలు, నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా.
ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ వేదిక, వేలాది వాహనాలకు పార్కింగ్ సదుపాయం, మూడు రోజుల పాటు కార్యకర్తలకు భోజన వసతి, అతిథులకు తగిన నివాస ఏర్పాట్లు వంటి అన్ని అంశాల్లో సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడును పసుపు పండుగలా నిర్వహించేందుకు పార్టీ శ్రద్ధ తీసుకుంటోంది.
నెల్లూరులో జరగనున్న ఈ మహానాడు కేవలం ఒక పార్టీ కార్యక్రమమే కాకుండా, జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహోత్సవంగా మారనుందని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.