బాధితుల కోసం రోడ్డుపైకి..
అర్ధరాత్రి ఉద్రిక్తత
మహిళా కానిస్టేబుల్‌కు గాయాలు
Telangana News Updates: ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ వద్ద సోమవారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు పోలీసులు తెరదించారు. భూదాన్ భూముల బాధితులకు న్యాయం చేయాలంటూ కవిత చేపట్టిన ఆందోళన చివరకు అరెస్టులతో ముగిసింది. బాధితులకు అండగా ఉంటానని, ప్రభుత్వం స్పందించే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్న కవితను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
వెలుగుమట్ల భూదాన్ బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు కవిత ఖమ్మం చేరుకున్నారు. వారి కష్టాలను విన్న అనంతరం, వారికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె ధర్నాకు దిగారు. బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, పేదల భూములను కాపాడటంలో యంత్రాంగం విఫలమైందని ఆమె మండిపడ్డారు.
సాయంత్రం మొదలైన నిరసన కాస్తా నిరాహార దీక్షగా మారింది. "న్యాయం జరిగే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదు" అని కవిత ప్రకటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమయం గడిచేకొద్దీ అక్కడకు భారీగా కార్యకర్తలు, బాధితులు చేరుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు దీక్షను విరమించాలని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో అర్ధరాత్రి సమయంలో పోలీసులు రంగప్రవేశం చేశారు.
పోలీసులు కవితను అరెస్ట్ చేసే ప్రయత్నంలో అక్కడ భారీ తోపులాట చోటుచేసుకుంది. కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ తోపులాటలో ఒక మహిళా కానిస్టేబుల్ తీవ్ర అస్వస్థతకు లోనై సొమ్మసిల్లి పడిపోయారు. బాధితులు, కార్యకర్తలు పోలీసుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. చివరకు కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై ఖమ్మం ఏసీపీ స్పందించారు. శాంతియుత నిరసనలకు అనుమతి ఉన్నప్పటికీ, ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై, ముఖ్యంగా మహిళా అధికారులపై దాడులు చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బాధ్యులపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. వెలుగుమట్ల భూ సమస్యపై కవిత చేసిన ఈ పోరాటం మున్ముందు ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.