విద్యావంతుడి నాయకత్వంలో వెలుగొందుతున్న విద్యావ్యవస్థ..
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం..
మంగళగిరి: రాష్ట్రంలో విద్యావ్యవస్థ మార్పు దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు గణనీయంగా మెరుగుపడినట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యావంతుడైన నాయకుడు విద్యాశాఖ బాధ్యతలు చేపడితే ఫలితాలు ఎలా ఉంటాయో ఈసారి ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు.
పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ విజయానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా విద్యా రంగంలో అమలు చేసిన మార్పులు ఈ ఫలితాల్లో ప్రతిఫలించాయని వివరించారు.
ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25కు చేరుకోగా, గత ఏడాది ఇది 81.1 శాతం మాత్రమే ఉందని గుర్తుచేశారు. అంతేకాదు, 2022లో 67.26 శాతానికి పడిపోయిన ఫలితాలను ఈ స్థాయికి తీసుకురావడం ఒక పెద్ద విజయమని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 72.8 నుంచి 78.39కు పెరగడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పారు.
బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఫలితంగా ఈసారి వారు 87.90 శాతం ఉత్తీర్ణత సాధించి, బాలుల కంటే 5.22 శాతం ముందంజలో ఉన్నారని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలు 96.04 శాతం ఫలితాలతో ప్రత్యేక గుర్తింపు సాధించాయని పేర్కొన్నారు. “తల్లికి వందనం” పథకం ద్వారా విద్యార్థుల కుటుంబాలకు అందుతున్న ఆర్థిక సహాయం బడి మానివేతను తగ్గించి, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచిందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 9,600 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, ఒక తరగతికి ఒక ఉపాధ్యాయ విధానం, “మెగా పీటీఎం” వంటి కార్యక్రమాలు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచాయని వివరించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యా కిట్లు, NCERT పాఠ్యాంశాలు, అలాగే డొక్కా సీతమ్మ పేరుతో నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, అప్పటి పాలనలో విద్యా రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం మాత్రం విద్యను అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ, సమాజ మార్పుకు మార్గం సుగమం చేస్తున్నారని నారా లోకేష్ నాయకత్వాన్ని ప్రశంసించారు. చివరగా, విద్యార్థులు కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా, మహాకవి శ్రీశ్రీ ఆశయాలను అనుసరిస్తూ ప్రపంచ స్థాయి విజయాలు సాధించాలని కాలవ శ్రీనివాసులు ఆకాంక్షించారు.