కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన..
‘మేడే’ సందర్భంగా కార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లాలో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో పేదల సంక్షేమం, కార్మికులతో మమేకం, ఆరోగ్య సేవల విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా సీఎం పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలకు వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా కలవనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారులను పరామర్శించి, వారి ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేయనున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రూ.63,158 కోట్లను పింఛన్ల రూపంలో పేదలకు అందించినట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలోనే ప్రతీ నెల 2.34 లక్షల మందికి సుమారు రూ.102 కోట్లను ప్రభుత్వం పింఛన్లుగా ఇస్తోంది.
మేడే సందర్భంగా కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి, భవన నిర్మాణ కార్మికులతో ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుని తక్షణ చర్యలపై చర్చించనున్నారు.
అదేవిధంగా గుడ్లవల్లేరు వద్ద నిర్మించిన ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిను సీఎం ప్రారంభించనున్నారు. ఈ ఆసుపత్రి ప్రారంభంతో స్థానిక ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
పర్యటన షెడ్యూల్:
ఉదయం సీఎం తన నివాసం నుంచి బయలుదేరి 10.15 గంటలకు వీరంకిలాకు గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.25 గంటలకు పమిడిముక్కలకు చేరుకుని ప్రజావేదికలో సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ఎన్టీఆర్ కాలనీలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారు.
మధ్యాహ్నం 12.45 గంటలకు మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో సమావేశం జరపనున్నారు. 01.55 గంటలకు పామర్రు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు.
తరువాత 03.40 గంటలకు గుడ్లవల్లేరు చేరుకుని, 03.50 గంటలకు కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 04.45 గంటలకు సీఎం తిరిగి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
ఈ పర్యటన ద్వారా ప్రజలతో నేరుగా కలసి వారి సమస్యలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు పరిస్థితిని సమీక్షించడం, అలాగే ఆరోగ్య రంగానికి మరింత బలం చేకూర్చడం లక్ష్యంగా సీఎం ముందుకు సాగుతున్నారు.