నేటి ఆధునిక కాలంలో అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్ అద్భుతాలను సృష్టిస్తున్నప్పటికీ, అదే ఫోన్ భారతీయ యువతను 'డిజిటల్ బందీలుగా' మారుస్తోందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంటులో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 'ఆర్థిక సర్వే 2025-26' నివేదికలో డిజిటల్ వ్యసనం (Digital Addiction) ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా రూపుదాల్చుతోందని కుండబద్దలు కొట్టినట్లు పేర్కొన్నారు. కేవలం సరదా కోసం మొదలయ్యే ఈ అలవాటు, మెల్లగా మానసిక వ్యాధిగా మారి దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.
సామాజిక మూల్యం.. తగ్గిపోతున్న ఉత్పాదకత
ఈ నివేదిక ప్రకారం, ముఖ్యంగా 15 నుండి 24 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో సోషల్ మీడియా వ్యసనం ప్రమాదకర స్థాయిలో ఉంది. గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల 'స్లీప్ డెట్' (నిద్ర లేమి) సమస్య తలెత్తుతోందని, ఇది వారి విద్యా సామర్థ్యాన్ని మరియు పని ప్రదేశాల్లో ఉత్పాదకతను దెబ్బతీస్తోందని సర్వే వెల్లడించింది. దీనికి తోడు 'కంపల్సివ్ స్క్రోలింగ్' గేమింగ్ డిజార్డర్స్ వంటివి యువతలో దూకుడును పెంచుతున్నాయని, వారు సామాజికంగా ఒంటరితనాన్ని కోరుకుంటున్నారని నివేదిక స్పష్టం చేసింది.
డిజిటల్ వ్యసనం
డిజిటల్ వ్యసనం కేవలం సమయాన్ని వృథా చేయడం మాత్రమే కాదు, అది ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression), మరియు ఆత్మన్యూనతా భావానికి దారితీస్తోంది. ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం, సైబర్ బుల్లీయింగ్ వంటివి కిశోర ప్రాయంలో ఉన్న పిల్లల మానసిక స్థితిని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది.
టెలి-మానస్ : అక్టోబర్ 2022లో ప్రారంభమైన ఈ మానసిక ఆరోగ్య సేవ ద్వారా ఇప్పటివరకు సుమారు 32 లక్షల కాల్స్ వచ్చాయంటేనే సమస్య తీవ్రత అర్థమవుతోంది.
షట్ క్లినిక్ : బెంగళూరులోని నిమ్హాన్స్ (NIMHANS) లో సాంకేతిక వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఆన్‌లైన్ గేమింగ్ చట్టం, 2025: ఆన్‌లైన్ గేమింగ్ వల్ల కలిగే ఆర్థిక నష్టాలను, వ్యసనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కీలక చట్టాన్ని తీసుకువచ్చింది.
డిజిటల్ ప్రపంచం నుండి యువతను పూర్తిగా దూరం చేయడం సాధ్యం కానప్పటికీ, కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఆర్థిక సర్వే సూచించింది. పాఠశాలల్లో 'డిజిటల్ వెల్నెస్ కరికులమ్' (డిజిటల్ ఆరోగ్య పాఠ్యాంశాలు) ప్రవేశపెట్టాలని, తద్వారా విద్యార్థులకు సైబర్ భద్రత మరియు స్క్రీన్ టైమ్ నియంత్రణపై అవగాహన కల్పించాలని తెలిపింది. అలాగే గ్రామీణ మరియు మురికివాడ ప్రాంతాల్లో యువత ఆన్‌లైన్ ప్రపంచం నుంచి బయటకు వచ్చి క్రీడలు, ఇతర సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనేలా 'ఆఫ్‌లైన్ యూత్ హబ్స్' ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది.