మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్'కు పార్లమెంట్లో మద్దతుపై సీఎం లేఖ..
జనసేన అధ్యక్షుడు పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‍కు లేఖ పంపిన సీఎం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత దిశగా కీలక అడుగు వేశారు. ‘నారీ శక్తి వందన్’ మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు తెలపాలని కోరుతూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు లేఖలు రాశారు.
ఈ లేఖల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని సంకల్పాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు. ఈ నెల 16న పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ముఖ్య ఘట్టమని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు ప్రత్యేకంగాజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాధవ్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలలకు లేఖలు పంపారు. అలాగే సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులకు కూడా విజ్ఞప్తి చేశారు.
‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లు మహిళా సాధికారతకు, దేశ అభివృద్ధికి దోహదపడుతుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం, పరిపాలన, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
మహిళలు ముందుకు వస్తేనే నిజమైన ప్రగతి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. “భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలుకుదాం” అని అన్ని పార్టీలను ఒకే వేదికపైకి రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన చర్చకు దారితీయనుంది.