న్యాయ శాఖ పటిష్టత కోసం చర్యలు..
పబ్లిక్ లిటిగేషన్ పాలసీ- 2025పై మంత్రి వర్గ ఉపసంఘం భేటి..
అమరావతి: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో “ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ-2025”పై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది.
ఈ సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. న్యాయశాఖ ఉన్నతాధికారులతో కలిసి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలో అనవసరమైన వ్యాజ్యాలను తగ్గించడం, కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం ప్రధాన లక్ష్యమని మంత్రి ఫరూక్ తెలిపారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
కేసులు కోర్టులకు వెళ్లే ముందే పరిష్కరించే విధానాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ముందస్తు కేసు నిర్వహణ ద్వారా అప్పీల్స్‌ను సమర్థవంతంగా దాఖలు చేయడం, విధానపరమైన జాప్యాలను తొలగించడం వంటి అంశాలపై మంత్రుల ఉపసంఘం సూచనలు చేయనుంది.
ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలు (ADR) ను ప్రోత్సహించడం, లోక్ అదాలత్‌లను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా వ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు.
ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న లిటిగేషన్ పాలసీలను పరిశీలించి, అక్కడి మంచి పద్ధతులను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని మంత్రులు సూచించారు. సంస్కరణలను కూలంకషంగా అధ్యయనం చేసి రాష్ట్రానికి అనుకూలంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
న్యాయ వ్యవస్థను వేగవంతం చేసి ప్రజలకు సమయానికి న్యాయం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు, భవిష్యత్తులో కేసుల భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.