దక్షిణాసియా ఆర్థిక చిత్రపటం శరవేగంగా మారబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ప్రపంచానికే వస్త్ర రాజధానిగా వెలిగిన బంగ్లాదేశ్ నేడు మనుగడ కోసం పోరాడుతుండగా, మరోవైపు భారత రిజర్వ్ బ్యాంక్ అత్యంత వ్యూహాత్మకంగా తన విదేశీ నిల్వలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఈ రెండు పరిణామాలు ఆసియా ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిగా మారబోతున్నాయి అని తెలుపుతున్నారు.
బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి గార్మెంట్ రంగం ఇప్పుడు కుప్పకూలే స్థితికి చేరుకుంది. ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 'డ్యూటీ ఫ్రీ యార్న్ ఇంపోర్ట్' (పన్ను లేని నూలు దిగుమతి) విధానమే ఇప్పుడు ఆ దేశానికి శాపంగా మారింది.
స్పిన్నింగ్ మిల్లుల మూత: ఫిబ్రవరి 1 నుండి దేశవ్యాప్తంగా ఉన్న స్పిన్నింగ్ మిల్లులన్నీ శాశ్వతంగా బంద్ చేస్తామని 'బంగ్లాదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్' (BTMA) సంచలన ప్రకటన చేసింది. చౌకైన భారతీయ నూలు మార్కెట్‌ను ముంచెత్తడంతో, స్థానిక మిల్లులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి.
స్తంభించిన సరఫరా గొలుసు: స్పిన్నింగ్ మిల్లులు మూతపడితే దారం ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా బట్టల తయారీ స్తంభించి, బిలియన్ల కొద్దీ ఎగుమతి ఆర్డర్లు రద్దయ్యే ప్రమాదం ఉంది.
నిరుద్యోగ గండం: ఈ నిర్ణయం వల్ల దాదాపు 10 లక్షల మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానిక పరిశ్రమను కాపాడాలా లేక ఎగుమతిదారుల ప్రయోజనాలను చూడాలా అనే సందిగ్ధంలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది.
బంగ్లాదేశ్ తన తప్పుడు విధానాలతో సతమతమవుతుంటే, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మాత్రం అత్యంత ముందుచూపుతో అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ తన ఖజానాలో కీలక మార్పులు చేస్తోంది.
అమెరికా బాండ్ల విక్రయం: ఆర్బీఐ తన వద్ద ఉన్న అమెరికా ట్రెజరీ బాండ్లను భారీగా తగ్గించుకుంటోంది. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మన డాలర్ బాండ్ల విలువ $174 బిలియన్లకు పడిపోయింది.
బంగారమే అసలైన భరోసా: డాలర్ మీద ఆధారపడటం ప్రమాదకరమని గ్రహించిన ఆర్బీఐ, తన రిజర్వులలో బంగారం వాటాను ఏకంగా 16% కి పెంచింది. ఇది గత 20 ఏళ్లలో అత్యధికం. కేవలం బంగారం కొనడమే కాదు, విదేశీ బ్యాంకుల్లో (ముఖ్యంగా లండన్‌లో) ఉన్న మన బంగారాన్ని కూడా భారీ ఎత్తున భారత ఖజానాకు తరలిస్తున్నారు. 'గోల్డ్ ఇన్ యువర్ కస్టడీ ఈజ్ యువర్ గోల్డ్' అనే సూత్రంతో ఆర్బీఐ పనిచేస్తోంది.
ఎక్స్పర్ట్ ఒపీనియన్: భారత్‌కు ఇది ఒక చారిత్రక అవకాశం
బంగ్లాదేశ్ సంక్షోభం భారత టెక్స్టైల్ రంగానికి అంతర్జాతీయ మార్కెట్లో ఒక "గోల్డెన్ ఛాన్స్" అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, ఆర్బీఐ అనుసరిస్తున్న 'డీ-డాలరైజేషన్' వ్యూహం భవిష్యత్తులో గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చినా మనల్ని ఒక ఉక్కు కవచంలా కాపాడుతుంది ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.