ఎంఎస్ఎంఈ బ్యాంకు రుణాలు డబుల్..
పల్నాడు జిల్లా తాళ్లూరులో ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సు..
రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉత్పత్తుల స్టాల్స్ ప్రదర్శన..
రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(MSME) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరులో నిర్వహించిన MSME అవగాహన సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు MSME పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. యువత ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా 35 శాతం సబ్సిడీతో పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే రూ.300 కోట్లతో సీఎంఈపీ పథకం అమలులో ఉందని, MSME ద్వారా బ్యాంకు రుణాలను రెట్టింపు చేస్తున్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఫిషరీస్ రంగాల్లో కూడా రాయితీలతో రుణాలు ఇస్తున్నామని వెల్లడించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది డ్వాక్రా సభ్యులను పారిశ్రామిక రంగంలోకి తీసుకువచ్చామని, వచ్చే ఏడాది 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే చిన్న పరిశ్రమలు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు.
ప్రతి మండలంలో రూ.3-4 కోట్లతో చిన్న పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసి, రైతులు పండించే పంటలతో స్థానికంగా ఉత్పత్తులు తయారు చేసేలా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణపై కూడా మంత్రి ప్రస్తావిస్తూ, అమరావతి, విశాఖలను ఐటీ హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్–నిప్పన్ స్టీల్ ప్లాంట్ ద్వారా వచ్చే మూడు సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని చెప్పారు.
ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ, యువత ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, సబ్సిడీలు, శిక్షణతో యువతకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.
జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా మాట్లాడుతూ, పెదకూరపాడు నియోజకవర్గంలోని గారపాడులో 50 ఎకరాల్లో MSME ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నామని, ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. నరసరావుపేటలో కూడా 30 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఈ అవగాహన సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. అగ్ర వేస్టేజ్‌తో తయారైన బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులు, బ్యాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. MSME అధికారులు డీఎక్స్ ఎడ్జ్ ద్వారా వ్యాపారులకు మార్కెటింగ్ వ్యూహాలపై సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మారెడ్డి, MSME సీఈవో విశ్వ మనోహర్, చైర్మన్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.