Nri- నాపై దాడి ఇది తొలిసారి కాదు…
30 రోజుల్లో మళ్ళీ కరస్పాండెంట్స్ డిన్నర్…
శ్వేతసౌధంలో ట్రంప్ మీడియా సమావేశం…
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై శ్వేతసౌధంలో ప్రత్యేకంగా మాట్లాడారు. తమకు మునుపెన్నడూ లేని విధంగా "అసాధారణ భద్రత" (Extraordinary Security) కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. నిందితుడు భారీ ఆయుధాలతో సెక్యూరిటీ చెక్‌పాయింట్‌పైకి దూసుకురావడం భద్రతా లోపాలను ఎత్తిచూపుతోందని, అందుకే వైట్‌హౌస్ ప్రాంగణంలోనే ఒక అత్యాధునిక 'బాల్రూమ్' నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనలో డొనాల్డ్ ట్రంప్‌తో పాటు మెలానియా ట్రంప్, జేడీ వాన్స్ మరియు కేబినెట్ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారని ఆయన ధృవీకరించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కాలిఫోర్నియాకు చెందినవాడని, అతడి వద్ద అనేక ఆయుధాలు ఉన్నాయని తెలిపారు. దుండగుడి కాల్పుల్లో ఒక భద్రతా అధికారికి గాయాలయ్యాయని, అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల ఆయనకు ప్రాణాపాయం తప్పిందని ట్రంప్ వెల్లడించారు. గతంలో పెన్సిల్వేనియాలో జరిగిన దాడిని గుర్తు చేస్తూ, శక్తిమంతమైన వ్యక్తులపై దాడులు జరుగుతూనే ఉంటాయని, కానీ ఇలాంటివి మళ్ళీ జరగకూడదని పేర్కొన్నారు.
అదే సమయంలో, కాల్పులు జరిగిన సమయంలో వాషింగ్టన్ హిల్టన్ హోటల్లోనే ఉన్న కేఏ పాల్ కూడా స్పందించారు. అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేని పరిస్థితి రావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వల్లే ఇలాంటి హింసాత్మక వాతావరణం ఏర్పడిందని, ఇప్పటికైనా యుద్ధాలు ఆపి శాంతికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాను ఎప్పుడు అమెరికా వచ్చినా ఇదే హోటల్లో ఉంటానని, కానీ ఇలాంటి భయానక పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని పాల్ పేర్కొన్నారు.
వాయిదా పడిన ఈ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమాన్ని మరో 30 రోజుల్లోపు రీషెడ్యూల్ చేయనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ సమావేశం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో వాషింగ్టన్ అంతటా హైఅలర్ట్ ప్రకటించి, భద్రతను పర్యవేక్షిస్తున్నారు.