- Politics: గ్రీన్ ఎనర్జీ, ఏఐ, జనాభా నిర్వహణ వంటి భవిష్యత్ ప్రణాళికలను వివరించిన చంద్రబాబు..
- సైబరాబాద్ తర్వాత అమరావతి రూపంలో మరో నగరాన్ని నిర్మించే అవకాశం దక్కిందని వెల్లడి ..
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబై వేదికగా తన దార్శనికతను చాటుకున్నారు. 'ఎకనమిక్ టైమ్స్' వార్షిక పురస్కారాల వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా 'బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025' అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం పారిశ్రామిక దిగ్గజాలను ఆలోజింపజేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్‌ను నిర్మించి టెక్నాలజీ రంగంలో దేశానికి దిశానిర్దేశం చేసిన తనకు, ఇప్పుడు నవ్యాంధ్రలో అమరావతిని 'ఫ్యూచర్ సిటీ'గా తీర్చిదిద్దే అద్భుతమైన అవకాశం దక్కడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. అమరావతిని కేవలం ఇటుకలతో నిర్మించే రాజధానిగా కాకుండా, పర్యావరణ హితమైన 'గ్రీన్-బ్లూ' సిటీగా, నెట్-జీరో కార్బన్ కాన్సెప్టుతో హైదరాబాద్‌ను మించిన 'హైదరాబాద్ ప్లస్' నగరంగా నిర్మిస్తామని ఆయన ప్రతినబూనారు.
సంస్కరణల ద్వారానే సంపద సృష్టి సాధ్యమని, ఆ సంపదతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందించగలమని చంద్రబాబు విశ్లేషించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వచ్చిన మార్పులను వివరిస్తూ, 1990లలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నట్లే, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామని ప్రకటించారు. ప్రధాని మోదీ నిర్దేశించిన '2047 వికసిత్ భారత్' లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామి అవుతుందని, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌కు ఈ నెల 28న శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడించి పారిశ్రామిక వర్గాల్లో ఉత్సాహం నింపారు.
కేవలం ఆర్థికాభివృద్ధికే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతతో కూడిన సంక్షేమం గురించి కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న 10 శాతం మంది ధనవంతులు, పేదరికంలో ఉన్న 20 శాతం మందిని దత్తత తీసుకుని ఆదుకునేలా 'ఎంబీకే 10-20' (పీ4) ఫార్ములాను ఆయన ప్రతిపాదించారు. అలాగే, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జనాభా నిర్వహణపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న ఫెర్టిలిటీ రేటును దృష్టిలో ఉంచుకుని 'పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ'ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, జనాభా ఉన్న దేశాలే భవిష్యత్తులో సంపన్న దేశాలుగా నిలుస్తాయని తన వినూత్న ఆలోచనను పంచుకున్నారు. టెక్నాలజీ, సంక్షేమం, భవిష్యత్ జనాభా నిర్వహణల మేళవింపుతో చంద్రబాబు ఆవిష్కరించిన ఈ విజన్ ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతుందనడంలో సందేహం లేదు.