కొత్త రూల్స్‌తో హెచ్-1బీ వేట…
హెచ్-1బీ వీసా ఫీజులు భారీగా పెంపు….
ఎక్కువ జీతం ఉన్నవారికే వీసా గ్యారెంటీ!
H1b Visa Regestrations: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులకు కీలక సమయం ఆసన్నమైంది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బీ వీసా (H-1B Visa) రిజిస్ట్రేషన్ల ప్రక్రియను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారికంగా ప్రారంభించింది. ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్ మార్చి 19 వరకు అందుబాటులో ఉంటుంది. ఈసారి కొత్త నిబంధనల నడుమ ఈ ప్రక్రియ జరుగుతుండటంతో అభ్యర్థులు మరియు కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, అమెరికా వెలుపల నుంచి నిపుణులను తెచ్చుకోవాలనుకునే కంపెనీలు, అభ్యర్థి ఎంపికైన తర్వాత లక్ష డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే లాటరీ పద్ధతిలో కూడా భారీ మార్పులు చేశారు. గతంలో లాగా కాకుండా, ఈసారి ఎక్కువ జీతం (High Salary) తీసుకునే నిపుణులకు లాటరీలో అధిక ప్రాధాన్యత లభించనుంది. ఈ నిర్ణయం వల్ల కన్సల్టెన్సీల ద్వారా వెళ్లే వారిపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, సీనియర్ పొజిషన్లలో పనిచేసే నిపుణులకు ఇది గొప్ప వరంగా మారనుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు విషయంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి అభ్యర్థి రిజిస్ట్రేషన్ కోసం కంపెనీలు ఇప్పుడు 215 డాలర్లు (రూ.20 వేలు) చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా ప్రతి ఏటా కేవలం 85,000 హెచ్-1బీ వీసాలను మాత్రమే జారీ చేస్తుంది. ఇందులో 65,000 వీసాలు జనరల్ కేటగిరీ కింద ఉండగా, మిగిలిన 20,000 వీసాలను అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య (Masters Degree) అభ్యసించిన అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది.
ఈ వీసాల కోసం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పోటీ ఉంటుంది, ముఖ్యంగా భారతీయులే అత్యధిక శాతం దరఖాస్తులు చేసుకుంటారు. కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు నైపుణ్యం కలిగిన వ్యక్తులకు మరింత పారదర్శకమైన అవకాశాన్ని కల్పిస్తాయని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ వేతనాలతో అమెరికాలో ఉద్యోగాలు చేసే సంస్కృతిని నియంత్రించి, నిజమైన ప్రతిభ ఉన్నవారికే వీసాలు దక్కేలా ఈ మార్పులు చేశారు. అర్హులైన అభ్యర్థులు తమ స్పాన్సర్ కంపెనీల ద్వారా గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలి.