అమరావతిలో పొట్టి శ్రీరాములు మ్యూజియం…
అమరజీవి 125వ జయంతికి ప్రభుత్వం ఘన నివాళి…
పొట్టి శ్రీరాములు స్మృతివనంలో ప్రత్యేకతలు ఇవే…
Statue Of Sacrifice: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 'అమరజీవి పొట్టి శ్రీరాములు' స్మారకార్ధం నిర్మిస్తున్న "స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్" (త్యాగాల విగ్రహం) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం సాధించే క్రమంలో 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన ఆయన త్యాగానికి గుర్తుగా, ఈ విగ్రహాన్ని కూడా 58 అడుగుల ఎత్తులో రూపొందిస్తున్నారు. మార్చి 16న పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని పురస్కరించుకుని, తొలి దశలో భాగంగా ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించబోతున్నారు. ఈ ప్రాజెక్టును అమరావతిలోని ఒక ప్రధాన ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరియు మెమోరియల్ ట్రస్ట్ ఎంతో కృషి చేస్తున్నాయి.
ఈ స్మృతివనం తుల్లూరు మరియు పెద్దపరిమి మధ్య సుమారు 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడుతోంది. విగ్రహం మొత్తం ఎత్తు గురించి చూస్తే, భూమి మట్టం నుండి 48 అడుగుల ఎత్తు గల భవనం (పెడస్టల్), దానిపై 58 అడుగుల విగ్రహం వెరసి మొత్తం 106 అడుగుల భారీ నిర్మాణంగా ఇది కనిపిస్తుంది. ఇప్పటికే విగ్రహానికి సంబంధించిన కీలక భాగాలు (నడుము, పాదాలు వంటివి) నిర్మాణ స్థలానికి చేరుకున్నాయి. భారీ క్రైన్ల సహాయంతో వీటిని అమర్చే పనులు రాత్రింబవళ్లు జరుగుతున్నాయి.
నిర్మాణ నాణ్యత విషయంలో నిపుణులు ఎంతో పగడ్బందీగా వ్యవహరిస్తున్నారు. విగ్రహం గాలి వేగానికి తట్టుకునేలా విండ్ టెస్ట్ మరియు భూకంపాలను తట్టుకునేలా సాయిల్ టెస్టింగ్ నిర్వహించారు. సుమారు 28 టన్నుల బ్రాంజ్ (కాంస్యం) తో ఈ విగ్రహాన్ని జైపూర్ నుండి తెప్పించిన ముడి పదార్థాలతో హనుమాన్ జంక్షన్ లోని శిల్పులు రూపొందించారు. దీనికి లోపలి వైపు గట్టి ఐరన్ స్ట్రక్చర్ మరియు గడ్డర్లు అమర్చి, ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా ఐఐటి ఇంజనీర్ల సలహాలతో నిర్మిస్తున్నారు.
కేవలం విగ్రహమే కాకుండా, ఈ ఆవరణలో ఒక గొప్ప మ్యూజియం మరియు మినీ థియేటర్ కూడా రాబోతున్నాయి. పొట్టి శ్రీరాములు గారు వాడిన వస్తువులు, ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన ఛాయాచిత్రాలను చెన్నై నుండి సేకరించి ఇక్కడ భద్రపరుస్తారు. భావితరాలకు ఆయన త్యాగం తెలిసేలా 24 గంటల పాటు ఉచితంగా ఆయన బయోపిక్ ను ప్రదర్శించేలా మినీ థియేటర్ ను ప్లాన్ చేశారు. వీటితో పాటు యోగా మరియు ధ్యానం కోసం ప్రత్యేకమైన హాల్ ను కూడా మొదటి అంతస్తులో ఏర్పాటు చేస్తున్నారు.