మహిళా రాజకీయ సాధికారతకు మహానాడు నిర్ణయం మైలురాయి..
ఎన్టీఆర్ ప్రారంభించిన మహిళా సాధికారతను చంద్రబాబు బలోపేతం చేశారు: అనిత..
తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు ఎప్పటి నుంచో ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పుడు చట్టసభల్లో మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయించాలని తీసుకున్న నిర్ణయం మహిళల రాజకీయ భవిష్యత్తుకు కొత్త దిశను చూపుతుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అమరావతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె, మహానాడు వేదికగా తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
మహిళలను కేవలం ఓటర్లుగా మాత్రమే కాకుండా, నాయకత్వ లక్షణాలు కలిగిన శక్తిగా తీర్చిదిద్దాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని హోంమంత్రి స్పష్టం చేశారు. సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని పార్టీ ఎప్పటి నుంచో భావిస్తోందని తెలిపారు.
భారతీయ సంస్కృతిలో మహిళలకు ఉన్న గౌరవాన్ని గుర్తు చేసిన ఆమె, ఒక దశలో మహిళలను వంటింటికే పరిమితం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. అలాంటి సమయంలో మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు మహానేత నందమూరి తారక రామారావు తీసుకొచ్చిన సంస్కరణలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. కుటుంబ ఆస్తుల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించిన తొలి నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మహిళా హక్కుల చట్టాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
మహిళా విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక మహిళా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం, రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ముందుగానే గుర్తించడం ఎన్టీఆర్ దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంతో వేలాది మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎదిగారని చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూర్చారని హోంమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారిని ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దారని తెలిపారు. డ్వాక్రా వ్యవస్థ ఎంత బలంగా మారిందంటే, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
మహిళలు ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని అనిత తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు.
మహానాడులో ప్రకటించిన 33 శాతం రిజర్వేషన్ నిర్ణయం మహిళల రాజకీయ సాధికారతకు మైలురాయిగా నిలుస్తుందని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. మహిళలు కేవలం ఓటు హక్కు వినియోగించుకునే స్థాయిలో కాకుండా, ప్రజా విధానాలు రూపొందించే స్థాయికి ఎదగాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటోందన్నారు. సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే మహిళలు రాజకీయాలు, పరిపాలన, విద్య, వ్యాపారం వంటి అన్ని రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తారని చెప్పారు.
మహానాడు కేవలం రాజకీయ సమావేశం మాత్రమే కాదని, అది పార్టీ కార్యకర్తల భావోద్వేగాలకు ప్రతీక అని హోంమంత్రి అన్నారు. తీవ్ర ఎండలను సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో మహిళలు మహానాడులో పాల్గొనడం పార్టీపై మహిళలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మహిళల గౌరవం, భద్రత, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.